Monday, April 29, 2024

నందిపేట మెగా ఫుడ్ పార్క్‌కు రూ. 45 కోట్లు.. పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర చర్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద 50 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కులు, 10 ఎకరాల్లో ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇది డిమాండ్ ఆధారిత పరిశ్రమ అయినందున కేంద్రం తనంతట తానుగా వీటిని నెలకొల్పడం లేదన్నారు. డిమాండ్ ఉన్న చోట వ్యక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఎన్జీవోలు, FPOలు, PSUలు ముందుకొస్తే వారికి మా శాఖ క్రెడిట్ లింక్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (క్యాపిటల్ సబ్సిడీ)ని గ్రాంటు రూపంలో పరిశ్రమ నెలకొల్పే వారికి అందజేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించి మెరిట్ ఆధారంగా పథకం కోసం ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 41 మెగా ఫుడ్ పార్కులను మంజూరు చేశామని, అందులో 22 పార్కులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 68 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను మంజూరు చేయగా, 12 క్లస్టర్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వివిధ ప్రభుత్వ విభాగాల అనుమతుల్లో జాప్యం, రుణాల మంజూరులో జాప్యం, కోవిడ్ మహమ్మారి పరిస్థితులు ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతికూల ప్రభావం చూపాయని జవాబులో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో మెగా ఫుడ్ పార్క్ 2019 సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమై కార్యాకలాపాలు నిర్వహిస్తోందని, ఇందుకోసం కేంద్రం రూ. 45 కోట్లు విడుదల చేసిందని మంత్రి ప్రహ్లాద్ సింగ్ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement