Wednesday, May 1, 2024

ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌.. ఢిల్లి క్యాపిటల్స్‌పై 8 వికెట్లతో ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యుపిఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. మొదటి రెండు మ్యాచ్‌లలో గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలుపొందిన హర్మన్‌ సేన ఢిల్లి క్యాపిటల్స్‌పైనా అదే దూకుడు ప్రదర్శించింది. గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లిని చిత్తుచేసింది. 8 వికెట్ల తేడాతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లి 105 పరుగులకే ఆలౌట్‌ అయింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ సేన, రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. యాస్తికా భాటియా 41, హేలీ మాథ్యూస్‌ 32 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

శిఖాపాండే వేసిన నాలుగో ఓవర్‌లో మాథ్యూస్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా, మారిజేన్‌ కాప్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో యాస్తికా మూడు బౌండరీలు బాదింది. ధాటిగా ఆడుతున్న యాస్తికాను తొమ్మిదవ ఓవర్‌లో తారా నోరిస్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. 77 పరుగుల జట్టు స్కోరు వద్ద మారిజన్‌ బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి మాథ్యూస్‌ ఔటైంది. నట్‌సివర్‌ (23), హర్మన్‌ (11) అజేయంగా జట్టును విజయతీరానికి చేర్చారు. నట్‌సివర్‌ వరుస ఫోర్లతో విన్నింగ్‌ షాట్‌తో అలరించింది. ఢిల్లి బౌలర్లలో తారా నోరిస్‌, కాప్సే చెరొక వికెట్‌ పడగొట్టారు.

- Advertisement -

తొలి రెండు మ్యాచ్‌లలో రెండేసి వందల స్కోర్లు సాధించిన ఢిల్లి ఈసారి తడబడింది. తొలి ఓటమిని నమోదు చేసుకుంది. పట్టుమని 20 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేక పోయింది. 18 ఓవర్లలో కేవలం 105 పరుగులకే ఆలౌట్‌ అయింది.గత మ్యాచ్‌లలో శుభారంభం ఇచ్చిన ఓపెనర్‌ షఫాలీ వర్మ, జోనాసెన్‌ తక్కువ స్కోర్లకే ఔటవడం ఢిల్లిdని దెబ్బతీసింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లు వరుసగా వికెట్లుతీస్తూ ఢిల్లి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. భారీ షాట్లకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బంతులు విసిరారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లి కెప్టెన్‌ మేగ్‌లానింగ్‌ అంచనాలు తప్పాయి. తొలి ఓవర్‌ నుంచే పరుగులు రావడం కష్టతరమైంది. రెండవ ఓవర్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన షఫాలీ క్లీన్‌బౌల్డ్‌ అయింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (43, 41 బంతుల్లో 5ఫోర్లు) రాణించగా, జెమీమా రోడ్రిగ్స్‌ (25, 18 బంతుల్లో 3 ఫోర్లు) అలరించింది. షెఫాలీ వర్మ (2), అలీస్‌ క్యాప్సీ (6), మరిజేస్‌ కాప్‌ (2), జెస్‌ జొసెన్‌ (2), తానియా భాటియా (4), రాధా యాదవ్‌ (10), తారా నోరిస్‌ (0), మిన్ను మని (0) దారుణంగా విఫలమయ్యారు. ఒక దశలో 12ఓవర్లకు 80/3 స్కోరుతో మెరుగ్గా కనిపించిన ఢిల్లి జట్టు ఆ తర్వాత పేకమేడలా కుప్పకూలింది. మరో 25 పరుగులు మాత్రమే సాధించి మిగతా ఏడువికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్‌లో రోడ్రిగ్స్‌, మెగ్‌ లానింగ్‌లను ఔట్‌చేసిన ఇషాక్‌ ప్రత్యర్థి పతనాన్ని శాసించింది.

తర్వాత ఓవర్‌లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కిందటి మ్యాచ్‌లో రాణించిన జొనాసెన్‌తోపాటు, మిన్నును మాథ్యూస్‌ పెవిలియన్‌ బాట పట్టించింది. 17వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన ఇస్సీవాంగ్‌, భాటియా, రాధాయాదవ్‌లను ఔట్‌ చేయగా, తర్వాతి ఓవర్‌లో నోరిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఢిల్లి ఇన్నింగ్స్‌కు తెరదించింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్‌, ఇస్సీవాంగ్‌, హేలీ మాథ్యూస్‌ మూడేసి వికెట్లతో ఢిల్లిని దెబ్బతీశారు. పూజా వస్త్రాకర్‌ ఒక వికెట్‌ పడొగొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement