Monday, April 29, 2024

ఏప్రిల్ 29న కాశీ-తెలుగు సంగమం.. పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని.. వెల్లడించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానున్న గంగా పుష్కరాల్లో భాగంగా ‘కాశీ-తెలుగు సంగమం’ పేరుతో ఏప్రిల్ 29న జరపనున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగా పుష్కరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు గంగా పుష్కరాలు జరుగుతాయని, ‘శ్రీ కాశీ తెలుగు సమితి’కి గౌరవాధ్యక్షుడి హోదాలో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం కావడంతో ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో వారణాసి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

5 ప్రత్యేక బస్ రూట్లలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపనున్నట్టు వెల్లడించారు. అలాగే 24 గంటల పాటు హెల్ప్ లైన్, పోలీస్ గస్తీ సహా తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాశీని దర్శించుకునే యాత్రికుల్లో అత్యధిక భాగం తెలుగువారే ఉంటున్నారని, అందుకే తెలుగు యాత్రికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి వారణాసికి నేరుగా రైలు సదుపాయం ఇప్పటి వరకు లేదని, గంగా పుష్కరాల కోసం విశాఖపట్నంతో పాటు గుంటూరు, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించారని తెలిపారు.

- Advertisement -

గంగా పుష్కరాల సమయంలోనే ఏప్రిల్ 29న ‘కాశీ తెలుగు సంగమం’ పేరుతో తాను ప్రత్యేక చొరవ తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ప్రధాని మోదీని కోరానని చెప్పారు. ప్రధాని పాల్గొంటున్నట్టు ఆయన కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారని, తెలుగు యాత్రికులను ఉద్దేశించి ఆయన ఆరోజు ప్రసంగిస్తారని చెప్పారు. కాశీ పుణ్యక్షేత్రంతో తెలుగు ప్రజలకు ఉన్నంత అనుబంధం మరే రాష్ట్రం, భాష ప్రజలకు ఉండదని.. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు తెలుగు భాషలో కాశీలోని సత్రాలు, ఉచిత అన్నదాన సదుపాయాలు, కర్మకాండలు నిర్వహించే తెలుగు పురోహితుల వివరాలు సహా సమగ్ర సమాచారంతో ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించామని, ఆ పుస్తకం ఈ-కాపీని సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచానని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement