Friday, May 3, 2024

ధనిక, విద్యాధిక కుటుంబాల్లోనే అధికంగా సీజేరియన్‌ ఆపరేషన్లు.. సీజేరియన్ లో తెలంగాణనే టాప్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ”చదివేస్తే ఉన్న మతి పోయిందట. బాగా డబ్బుంటే కళ్లు నెత్తికెక్కుతాయి.” జనబాహుళ్యంలో విరివిగా ప్రచారంలో ఉన్న ఈ సామెతలు రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతున్న సీజేరియన్‌ కాన్పుల పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే డబ్బు బాగా ఉన్న సంపన్న, బాగా చదువుకున్న వారి కుటుంబాల్లోనే సీ సెక్షన్‌ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యయనాల వివరాల ప్రకారం… ధనిక కుటుంబాల్లో 39శాతం సీ సెక్షన్లు జరుగుతుంటే… తక్కువ ఆదాయం ఉన్న పేద, సామాన్య కుటుంబాల్లో 7శాతం మాత్రమే సీ సెక్షన్లు జరుగుతున్నాయి. ఇంటి దగ్గరో, లేదంటే ఆసుపత్రిలోనో సాధారణ ప్రసవం ద్వారా తల్లి బిడ్డకు జన్మినిస్తే నామూషీగా భావిస్తున్న ధనిక కుటుంబాలలు అనేకం ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక చదువుకున్న దంపతులే ఎక్కువ మంది సిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 12ఏళ్ల కంటే ఎక్కువ వయసు వరకు విద్యాభ్యాసం చేసిన వారిలో 35శాతం సీజేరియన్లు జరుగుతుండగా… అసలు చదువుకోనివారిలో 8శాతమే సీజేరియన్లు జరుగుతున్నాయి. పిల్లలు మంచి రోజు పుట్టాలని ముహుర్తాలు పెట్టించుకుని ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పెళ్లిరోజు వంటి ప్రత్యేక తేదీల్లో పిల్లలు పుట్టాలని కోరుకునేవారూ ఉన్నారు.

ఇక ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 98శాతం వరకు సీ సెక్షన్లే ఉండడం గమనార్హం. డెలివరీ కోసం చేసే సీ సెక్షన్‌ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ తర్వాతి స్థానాల్లో సీ సెక్షన్‌ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ద్వితీ య స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తృతియస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో సీ సెక్షన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్‌ జిల్లా టాప్‌లో ఉంది. 300 పడకలు, ఆపై ఉన్న పెద్దస్థాయి ఆసుపత్రుల కేటగిరీలో దేశంలోనే అత్యధిక సపీ సెక్షన్లు జరిగిన ఆసుపత్రుల్లో కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి 69.93శాతం ఆపరేషన్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం. ఇక కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరియన్లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఆసుపత్రుల్లోనైనా సీ సెక్షన్‌ ఆపరేషన్లు 10శాతం దాటితే అవి తల్లి, బిడ్డ మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావని, కేవలం ధనార్జనే ధ్యేయంగా జరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేస్తోంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం సీ సెక్షన్లు మొత్తం కాన్పుల్లో కేవలం 10శాతం, ఒక్కోసారి 15శాతం వరకు మాత్రమే ఉండాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని నీతి ఆయోగ్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. కరీంనగర్‌ జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇప్పటికీ 90శాతం సిజేరియన్లే జరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లాలో 77శాతం, మం చిర్యాల, నిర్మల్‌లో నూ90శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 62.36శాతం సీజేరియన్లు ఈ ఏడాదికి 79.14శాతానికి చేరుకున్నాయి. దక్షిణ తెలంగాణ చాలా తక్కువస్థాయిలో సిజేరియన్లు జరుగుతున్నాయి. గద్వాల జిల్లాలో అధికంగా సాధారణ కాన్పులే జరుగుతుండడం ఆహ్వానించదగిన పరిణామమని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సీజేరియన్‌తో పలు సమస్యలు..

సీజేరియన్లతో ఆపరేషన్‌ తర్వాత పూర్తి విశ్రాంతి కావాలి. కుట్లు మానడం, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో కొందరికి గర్భాశయ సమస్యలు వస్తుంటాయి. సీజేరియన్‌ ఆపరేషన్‌ కారణంగా బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాదు. కొందరిలో వెర్టికల్‌ కట్‌ వల్ల హెర్నియా వచ్చే ప్రమాదం ఉంటుంది. సహజ ప్రసవంలో అబ్డామిన్‌ కోయనక్కర్లేదు… ఇన్‌ఫెక్షన్లు ఉండవు. గంటలో నడిచేయొచ్చు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement