Wednesday, May 22, 2024

Delhi | మోదీయే మా బ్రహ్మాస్త్రం.. మా పార్టీ బలంగా ఉంది కాబట్టే విమర్శలు : డా. కే. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలంగా ఉంది కాబట్టి అన్ని పార్టీలూ కలిసి తమపై విమర్శలు చేస్తున్నాయని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీని అసలు పరిగణలోకే తీసుకోవడం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఎందుకు కంగారుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఆరోపణలను తిప్పికొడుతూ.. నిజానికి బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలకు మజ్లిస్ పార్టీ గురువు అని డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఎప్పుడూ మజ్లిస్‌ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఏ రాష్ట్రమైనా అధికారంలో ఉన్న పార్టీతో మజ్లిస్ ఉంటుందని గుర్తుచేశారు. ప్రధాని మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కలిసి ఉండాలని పిలుపునిచ్చింది రాహుల్ గాంధీయేనని, ఆ లెక్కన ఏయే పార్టీలు కలిసున్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

ఇక తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే తమ ‘బ్రహ్మాస్త్రం’ అని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మోదీ పేరుతోనే ముందుకెళ్తామని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల జాబితా 2 నుంచి 4 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

- Advertisement -

మద్దతు ధర పెంపు, డీఏ పెంపు పండుగ కానుక

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రబీ పంటల కనీస మద్దతు ధర పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంపును దసరా, దీపావళి కానుకలుగా డా. లక్ష్మణ్ అభివర్ణించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, గోధుమ పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 150 పెంచి రూ. 2,275గా ప్రభుత్వం నిర్థారించిందని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక పెంపు అని తెలిపారు.

దీంతోపాటు, వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా వరి, ఆవాల పంటలకు రూ. 200, కుసుమ పంటకు రూ.150, బార్లీ పంటకు రూ.115, కంది పంటకు రూ.105 మేర మద్దతు ధరను కేంద్రం పెంచిందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆహార భద్రత పెంచేందుకు, దిగుమతులపై ఆధారపడకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే గత ఎనిమిదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 31 శాతం పెరిగిందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4 శాతం పెంచడాన్ని లక్ష్మణ్ స్వాగతించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 1.17 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు.

పండుగల సీజన్‌లో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదాన్ని పాటిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికి మోదీ ప్రభుత్వం శ్రేయోభిలాషి అని అన్నారు.  రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇవ్వాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి డా. లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement