Tuesday, April 30, 2024

మ‌రో కేసులో ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి మూడు నెల‌ల జైలు శిక్ష

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి జైలుకెళ్లే ప‌రంప‌ర కొన‌సాగుతూ వ‌స్తోంది. ఒక కేసులో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తే.. మ‌రో కేసు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఐదేళ్ల క్రితం నాటి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని, ఎన్సీపీ నేత రేష్మా ప‌టేల్ కు గుజరాత్ కోర్టు మూడు నెలల జైలుశిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘ఉనా ఫ్లాగింగ్’ ఘటనను నిరసిస్తూ 2017లో అనుమతి లేకుండా ‘ఫ్రీడమ్ మార్చ్’ పేరుతో నిరసన తెలిపిన కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. వీరితోపాటు సుబోధ్ పర్మార్‌ను కూడా నిందితుడిగా తేల్చింది. వీరు ముగ్గురితోపాటు మొత్తం 11 మందికి మూడు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. 1000 రూపాయల జరిమానా కూడా విధించింది. ప్రధానమంత్రి మోడీపై అనుచిత ట్వీట్లు చేశారన్న ఆరోపణలతో అస్సాం పోలీసులు మేవానిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో గత వారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇలా విడుదలయ్యారో లేదో.. మహిళా పోలీసు అధికారిపై దాడి చేసిన ఆరోపణలతో మేవానిని మరోమారు అరెస్ట్ చేశారు. జిగ్నేష్‌కు రెండో కేసులోనూ బెయిల్ మంజూరైంది. శనివారం ఆయన కోక్రాఝర్‌లోని కోర్టులో బెయిల్ ఫార్మాలిటీలను పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఐదేళ్ల క్రితం నాటి కేసులో మరోమారు ఆయన జైలుకు వెళ్లబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement