Saturday, April 27, 2024

రైస్ మిల్లుల బాగోతంపై మంత్రి వేముల ఫైర్

ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల బాగోతంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడ్తా పేరుతో దోచుకుంటున్నారని రైతులు వేల్పూర్ లోని మంత్రి నివాసంలో గోడు వెళ్ల బోసుకున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే.. జిల్లాలో కొన్ని రైస్ మిల్లులు కడ్తా పేరుతో రైతులను మోసం చేస్తుండటాన్ని మంత్రి వేముల సీరియస్ గా తీసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు రైస్ మిల్లర్ల తీరును మంత్రికి వివరించారు. దీంతో రైస్ మిల్లర్ల వ్యవహారంపై మంత్రి సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతుకు ఫోన్ కాల్ చేశారు. జిల్లాలోని పలు రైస్ మిల్లులు ఆగడాలపై కలెక్టర్ కు వివరించారు. రైతులను నష్టపరిచే విధంగా రైస్ మిల్లులు కడ్తా పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని సూచించారు మంత్రి. జిల్లాలో మొత్తం 220 రైస్ మిల్లులకు అలాంట్ మెంట్ ఇస్తే.. అందులో ఐదు రైస్ మిల్లర్లు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి వేముల కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా జిల్లాలోని ఐదు రైస్ మిల్లులు పద్మావతి రైస్ మిల్, కాపర్తి ఇండస్ట్రీస్, ఎల్ జీ ఆగ్రో, రుద్రా ఇండస్ట్రీస్, త్రివేణి రైస్ మిల్లులు కడ్తా పేరుతో రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ఈ ఐదు రైస్ మిల్లులో తక్షణమే పద్మావతి రైస్ మిల్లులో అలాట్ మెంట్ నిలిపివేయాలని ఈ ఏడాది బాన్ చేయాలని మంత్రి వేముల కలెక్టర్ కు ఆదేశించారు. మిగతా నాలుగు రైస్ మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. మ‌రోసారి కడ్తా పేరుతో మోసం చేస్తే మిగతా 4 మిల్లులను కూడా సీజ్ చేయాలని మంత్రి కలెక్టర్ కు చెప్పారు. క్లస్టర్ వైజ్ గా ఆన్ లోడింగ్ సక్రమంగా జరిగేందుకు ఆఫీసర్లను నియమించాలని మంత్రి సూచించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు.

జిల్లాలో ఇప్పటికే అకాల వర్షాలు అన్న దాతలను నిండా ముంచుతున్నాయి. వరి రైతులు చాలా నష్టపోతున్నారు. తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రైస్ మిల్లర్లు రైతులను కడ్తా పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి అన్నారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి రైతులకు అభయమిచ్చారు. కడ్తా సమస్యను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన తక్షణమే స్పందించి కలెక్టర్ కు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పటంతో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. అంతకు ముందు అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం… ధాన్యం కొనుగోలు పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని అన్నారు. అన్నివిధాలా ఆదుకుంటామని అన్నదాతకు భరోసా అందించాలని సూచించారు. టేలీ కాన్ఫిరెన్స్ లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంట వెంట మిల్లులకు తరలించి అన్ లోడింగ్ చేయించాలని అధికారులకు మంత్రి వేముల సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement