Monday, April 29, 2024

జీఎస్‌ఐ నివేదిక ఆధారంగా మైనింగ్ బ్లాక్స్‌ వేలం.. ఎంపీ అనురాధ ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక మైనింగ్ జోన్స్‌లో జీ3, జీ4 లెవెల్ వరకు మైనింగ్ చేసేందుకు వేలం నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోందని, ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. అమలాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ బుధవారం లోక్‌సభలో ఖనిజ సంపదపై రాయల్టీ ధరలపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభ్యమయ్యే ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం రాయల్టీ ధరలను సవరించిందా? ఒకవేళ సవరిస్తే వాటి వివరాలేంటి? చివరగా రాయల్టీ ధరలను ఎప్పుడు సవరించారు? అలా సవరించడానికి ప్రాతిపదికగా తీసుకున్న చర్యల వివరాలేంటని ప్రశ్నించారు. అందుకు మంత్రి సమాధానమిస్తూ కేంద్ర గనులు, ఖనిజాల చట్టం, 1957 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చివరగా 2014వ సంవత్సరంలో రాయల్టీ ధరలను సవరించిందని చెప్పారు.

అలాగే నూతన రాయల్టీ ధరలను నిర్ణయించేందుకు 2018వ సంవత్సరంలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ అధ్యయన బృందాన్ని నియమించిందని, ఆ బృందం తమ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయగా, ఖనిజ సంపద విలువను ఇండెక్స్ ఆధారిత పద్ధతిలో లెక్కగట్టేందుకు, ప్రభుత్వానికి రావాల్సిన చట్టబద్ధమైన చెల్లింపుల ధరలను నిర్ణయించడానికి మరో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ తన మొదటి నివేదికను కేంద్ర గనుల శాఖకు నివేదికను అందజేసిందని, రాయల్టీ ధరలను టన్ను పద్ధతిలో లెక్కగట్టేందుకు మరో కమిటీనీ నియమించినట్టు మంత్రి తెలిపారు. ఆ కమిటీ కూడా తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసిందని ఆయన చెప్పారు.

అనంతరం ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ… ప్రత్యేక మైనింగ్ జోన్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? ఒకవేళ ఆమోదిస్తే వాటి వివరాలేంటి? జాతీయ ఖనిజ విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మైనింగ్ జోన్స్ ఏర్పాటు చేయనుందా అని కేంద్ర మంత్రిని అడిగారు. అందుకు ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ… ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మైనింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక అనుగుణంగా తగిన మైనింగ్ బ్లాక్స్‌ను గుర్తించాక ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని, దాని ఆధారంగా సంబంధిత మైనింగ్ బ్లాక్స్‌పై వేలం నిర్వహించాలా వద్దా? నిర్వహిస్తే ఏ స్థాయి వరకు మైనింగ్ చేయడానికి అనుమతించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement