Monday, April 29, 2024

వ‌డ్ల బ‌స్తాల‌తో మిల్లులు ఫుల్.. యాసంగిలో కొనేవాటికి జాగా ఎట్ల‌?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండడంతో రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు జాగా లేకుండా పోయింది. గత ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలే మిల్లుల్లో ఎక్కువ శాతం పేరుకుపోవడంతో కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం నిల్వకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో జాగా ఉండడం లేదు. గత వానాకాలం ధాన్యం నిల్వలే మిల్లులు, గోడౌన్లలో 70శాతానికి పైగా స్థలాన్ని ఆక్రమించుకోవడంతో యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం అన్‌లోడింగ్‌ ఆలస్యమవుతోంది. త్వరగా ధాన్యాన్ని దించుకునే విషయంలో మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్లాల్లో తూకం అయినా ధాన్యం తరలింపుకు రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. మిల్లుల ముందు అన్‌లోడింగ్‌ కోసం ధాన్యంలోడ్‌తో లారీలు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

ప్రయివేటు గోడౌన్ల కోసం జిల్లా అధికారుల వేట..

ఆయా జిల్లాల్లోని అన్ని రైస్‌ మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో జిల్లా అధికారులతోపాటు సంబంధిత శాఖలకు పాలుపోవడం లేదు. ఆయా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఇప్పటి వరకు తక్కువ నిల్వలు ఉన్న మిల్లుల్లో కొంత ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రయివేటు, ప్రభుత్వ గోడౌన్‌లలో తాత్కాలికంగా ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు గోడౌన్‌ల కోసం పౌరసరఫరా, మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెతుకుతున్నారు. ఈ సారి నైరుతి ముందే పలకరించనుండడంతో రానున్న 15 రోజుల్లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండడంతో నిల్వ చేసే సామర్థ్యంలో మిల్లుల్లో లేకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement