Thursday, April 25, 2024

కాయ్​ రాజా కాయ్​.. ఐపీఎల్​ కోసం పెద్ద ఎత్తున బెట్టింగులు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : వనస్థలిపురానికి చెందిన ఓ బ్యాంక్‌ ఉద్యోగి బెట్టింగ్‌ క్రీడకు బానిసగా మారి సొంత బ్యాంక్‌లోనే కన్నం వేసి ఊచలు లెక్కపెడుతున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ డాన్‌ అమిత్‌ గుజరాతిని హైదరాబాద్‌ పోలీసులు మే మొదటివారంలో అరెస్ట్‌ చేశారు. ఇలా ప్రతిరోజు నగరంలో ఏదో ఒక మూల బెట్టింగ్‌ ముఠాల అరెస్ట్‌ లేదా బెట్టింగ్‌ బారిన పడి సర్వస్వం కోల్పోతున్న సామాన్యుల వార్తలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తున్నాయి. మార్చిలో ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అనేక ముఠాలను పట్టుకున్నప్పటికీ, ఈ జూదక్రీడకు అమాయకులు బలి అవుతూనే ఉన్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని బెట్టింగ్‌ ముఠాలు సర్వం దోచుకుంటున్నాయి. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిమిషానికి పందాలు కట్టించుకుంటున్నారు. మే 29న ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో బెట్టింగ్‌ ముఠాలు మరింత జోరుగా పందాలకు సిద్ధమవుతున్నాయి.

టాస్‌ గెలవడం నుంచి మొదలుకుని బాల్‌ బై బాల్‌, ఓవర్‌ బై ఓవర్‌ అంటూ తుది విజేత వరకు వివిధ రకాల బెట్టింగ్‌లకు దిగుతున్నారు. నగర యువత ఈ జూదక్రీడకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. చిన్నాచితకా పనిచేసే కూలీలు సైతం పందెం మోజులో సర్వం కోల్పోతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందాలకు అలవాటు పడి చేతి చమురు వదిలించు కుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను విధిన పడేయడమే కాకుండా ప్రాణాలు తీసుకునే స్థి తి వరకు చేరుకుంటున్నారు.

ఏజెంట్లు, స్మార్ట్‌ ఫోన్లు…

హైదరాబాద్‌ నగరంలో బెట్టింగ్‌ ముఠాలు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే లావాదేవీలు నడుపుతున్నారు. చిన్నచిన్న కిరాణా కొట్లు, పాన్‌ టేలాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద వ్యాపారులు సైతం వీరికి ఏజెంట్లుగా ఉంటూ బెట్టింగ్‌ను నడుపుతున్నారు. ఈ జూదానికి బానిసలుగా మారిన కొంతమంది స్వంతంగా స్మార్ట్‌ ఫోన్ల లో ఉండే క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌లలో పందాలు కాస్తున్నారు. చాలావరకు ఈ యాప్‌లు హిడెన్‌ మోడ్‌లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఇవి కనిపించవని అంటుంటారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు సాయంత్రం 7నుంచి రాత్రి 11వరకు సాగుతాయి. అయితే బెట్టింగ్‌లు ఉదయం నుంచే ప్రారంభమవుతున్నాయని సమాచారం. వీరికి సంబంధించిన చాలా వరకు ఆర్థిక లావాదేవీలు ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారానే జరుగుతాయని తెలుస్తోంది.

పోలీసులు మరింత నిఘా పెట్టాలి…

- Advertisement -

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో నగరంలో బెట్టింగ్‌లు మరింత ఊపందుకునే అవకాశం ఉన్నందున పోలీసులు మరింత దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ జూద క్రీడ మాయలో పడి ప్రజలు ఆర్థికంగా నష్ట పోవడంతో పాటు తమ కుటుంబాలను సైతం రోడ్డున పడేస్తున్నారు. బంగారు భవిష్యత్‌ను కాదని ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న యువతరానికి కనువిప్పు కలిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరింత నిఘా ఏర్పాటు చేసి ఈ జూదక్రీడకు అడ్డుకట్ట వేయాలని నగర వాసులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement