Friday, April 26, 2024

మళ్లీ ఆగిన మెట్రో, సాంకేతిక కార‌ణాలే కార‌ణం

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : హైదరాబాద్‌ మెట్రోను అడుగడుగునా సాంకేతికలోపం వెంటాడుతూనే ఉంది. తాజాగా మంగళవారం ఎల్బీనగర్‌ – మియాపూర్‌ మధ్య సాంకేతిక సమస్యతో మెట్రో రైలు ఆగిపోయింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ముసారాంబాగ్‌లో రైలును అరగంట పాటు నిలిపివేశారు. రైలు నిలిచిపోవడంతో మెట్రో రైళ్లు 20నిమిషాలకు పైగా ఆలస్యంగా నడిచాయి. మూడు కారిడార్లతో కనెక్టివిటి కలిగిన మెట్రో స్టేషన్ల లో ప్రయాణికులు వేచి ఉండక తప్పలేదు. సరిగ్గా ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత కొద్దిరోజులు క్రితం సికింద్రాబాద్‌ – జేబీఎస్‌ మెట్రో కారిడార్‌లోని పట్టాలపైకి ఓ వ్యక్తి మెట్రో రావడంతో మెట్రో రైళ్లను నిలిపి వేశారు.

అత్యంత భద్రత మధ్య కూడా ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్య కారణంగా మెట్రో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో విఫలమవుతున్నారే విమర్శలున్నాయి. నగరంలో వెలువడుతున్న ఫ్యాక్టరీల పొగ, ట్రాఫిక్‌ రద్దీ తదితర కారణాల వల్ల వాతావరణంలో దుమ్ము, దూళి పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు వెళ్లే మార్గంలో రెడ్‌ లైట్లు వెలుగుతున్నాయి. దీంతో మెట్రో రైళ్లు ఆకస్మికంగా నిలిచిపోతున్నాయని అధికారులు అంటున్నారు. దీనికి తోడు విద్యుత్‌ అంతరాయం, ఇతర కారణాల వల్ల వీటి పరుగుకు బ్రేకులు పడుతున్నాయి. భవిష్యత్‌లోనైనా మెట్రోకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement