Friday, April 26, 2024

నిత్యావసరాల‌ ధరలపై నిత్యం పర్యవేక్షణ.. ప్రత్యేక యాప్‌తో మానిట‌రింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ డా.సమీర్‌ శర్మ అధికారులను ఆదేశించారు. అలాగే నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేసారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిత్యావసర సరకుల ధరల స్థితిగతులపై సీఎస్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ ప్రతిరోజూ నిత్యావసర సరకుల ధరలను పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలోని రైతు బజారుల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ ను అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్‌ చెప్పారు. యాప్‌ ను అర్ధగణాంక విభాగం(డైరెక్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌) అధికారులు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈయాప్‌ ను మార్కెటింగ్‌ శాఖ,పౌరసరఫరాల శాఖలు,తూనికలు కొలతలు శాఖ, విజిలెన్సు అండ్‌ ఎన్ఫోర్సుమెంట్‌ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యేవేక్షించాల్సి ఉంటు-ందని సీఎస్‌ తెలిపారు. రైతు బజారుల్లో కూరగాయలను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని రైతు బజారుల సిఇఓ, మార్కెటింగ్‌ శాఖల అధికారులను సిఎస్‌ ఆదేశించారు.

ముఖ్యంగా ప్రస్తుతం టమోటా ధరలు అధికంగా ఉన్నందున మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద రైతుల నుండి నేరుగా టమోటాలను కొనుగోలు చేసి రైతు బజారుల్లో నిర్దేశిత ధరలకు అందుబాటు-లో ఉంచాలని సీఎస్‌ సమీర్‌ శర్మ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ గిరిజా శంకర్‌, మార్కెటింగ్‌ శాఖ కమీషనర్‌ ప్రద్యుమ్న, విజిలెన్సు అండ్‌ ఎన్ఫోర్సుమెంట్‌, ఆయిల్‌ ఫెడ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే వీడియో లింక్‌ ద్వారా రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూదన రెడ్డి, విజిలెన్సు అండ్‌ ఎన్ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాగ్చి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement