Tuesday, April 30, 2024

Delhi | విలీనమా, పోరాటమా.. సమాలోచనలో శరద్ పవార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రణమా.. శరణమా అన్న మాటలు యుద్ధభూమిలో ఓటమి అంచుమీద ఉన్నప్పుడు వినిపించే మాటలు. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుడి చేతిలో వెన్నుపోటుకు గురైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చీలిక వర్గం అజిత్ పవార్ గ్రూపులో చేరిపోగా, మిగిలిన నేతలను కాపాడుకోడానికి అష్టకష్టాలు పడుతున్న నిస్సహాయ స్థితిలో ఆయనున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి, ఎత్తుపల్లాలన్నీ చూసిన ఆరితేరిన నేత శరద్ పవార్. అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే మనిషి కూడా కాదు. కానీ ఇప్పుడు ఆయనకు అడ్డొస్తున్న అంశాలు రెండే. ఒకటి ఆయన కుమార్తె సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్తు.

రెండోది వయస్సు. “83 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా కుర్చీ వదలవా?’ అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ తన వయస్సు 93 సంవత్సరాలైనా సరే రాజకీయాల్లో చురుగ్గానే ఉంటానని చెప్పుకొచ్చారు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ మాటలు చెప్పినప్పటికీ ఆయన ఈ వెన్నుపోటుతో వణికిపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఆయన ముందు ఇప్పుడు రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి జూనియర్ పవార్ చీల్చుకుపోయిన నేతలను వెనక్కి రప్పించి అసలైన ఎన్సీపీని దక్కించుకోవడం, రెండోది తన పాత గూడైన కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయడం.

ఈ రెండింటిలో మొదటిది అంత సులభమేమీ కాదు. పదవులు, డబ్బు ఆశించి అజిత్ పవార్ వెంట వెళ్లినవారు వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శరద్ పవార్ వెంట నిలిచిన నేతలు ఎంత కాలం ఆయనతో కలిసి నడుస్తున్నారన్నది కూడా ప్రశ్నార్థకమే. పెద్దాయనతో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తే ఉన్న ఆ కొద్ది మంది కూడా జారుకునే ప్రమాదం లేకపోలేదు. అజిత్ పవార్ వెన్నుపోటు చర్య అనంతరం పార్టీపై తన పట్టు ఎంతో శరద్ పవార్‌కి తెలిసొచ్చింది.

- Advertisement -

పైగా తన కుమార్తె సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్తుకు భరోసా, భద్రత కల్పించడం కోసం పార్టీ పగ్గాల్ని ఆమె చేతిలో పెట్టాలనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అజిత్ పవార్ ఊహించని దెబ్బ కొట్టారు. మొత్తం 53 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో 29 మంది జూనియర్ పవార్ వెంట నిలవగా, సీనియర్ పవార్ వెంట కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పార్టీని చీల్చడంతోనే సరిపెట్టకుండా పార్టీ ఎన్నికల గుర్తును సైతం తన వశం చేసుకోవడం కోసం అజిత్ పవార్ వెంటనే పావులు కదిపారు. తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సంతకాలతో కూడిన మొత్తం 40 అఫిడవిట్లను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు.

తన కుమార్తెతో పాటు తన వెంట నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కాపాడుకోవడంతో పాటు వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించడమే శరద్ పవార్ ముందున్న అసలైన సవాలుగా మారింది. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే ఇందుకు పరిష్కారమని శరద్ పవార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ విలీనం ప్రతిపాదన కొత్తదేమీ కాదు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్-ఎన్సీపీలు పొత్తులకు బదులు విలీనం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని అనుకున్నారు. కానీ అప్పుడది కార్యరూపం దాల్చలేదు. చరిత్రలోకి వెళ్తే.. కాంగ్రెస్‌ అగ్రనేతల్లో ఒకరిగా వ్యవహరించిన శరద్ పవార్ 1999లో ఆ పార్టీని వీడి బయటికొచ్చారు.

కాంగ్రెస్ పగ్గాలను జన్మతః ఇటలీ జాతీయురాలైన సోనియా గాంధీ చేతుల్లో పెట్టడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సోనియా గాంధీ చేతుల నుంచి పార్టీ పగ్గాలు మల్లికార్జున ఖర్గే చేతికి వచ్చాయి. మరోవైపు సోనియా గాంధీ కూడా అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీని వీడినప్పడు ఉన్న అభ్యంతరాలు ఇప్పుడు లేవు. కాబట్టి ఎన్సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే సొంత పార్టీపై సర్వాధికారాలు కలిగి ఉన్న విధంగా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కుదరదు.

అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి, సమన్వయం చేయడంలో చేయితిరిగిన నేతగా పేరున్న శరద్ పవార్ కాంగ్రెస్‌‌కు సమయానుకూల వ్యూహాలను అందించగల అనుభవజ్ఞుడైన సీనియర్ నేతగా వ్యవహరించగలరు. మరోవైపు తన కుమార్తె సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీలో డిపాజిట్ చేసినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ నేతలందరితో సత్సంబంధాలు కలిగిన ఆమె ఇకపై తన భవిష్యత్తును ఆ పార్టీలో మరింతగా నిర్మించుకుంటూ ముందుకెళ్లగలరు.

ఇవన్నీ వ్యక్తిగత అంశాలైతే.. విలీనం కారణంగా రెండు పార్టీలకు కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో ఓట్లను ఏకీకృతం చేయడానికి ఈ విలీనం ఎంతో సహాయపడుతుంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడితే మహారాష్ట్రలో కనీసం 10-12 లోక్‌సభ స్థానాలు, 50-60 అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోవడం ఖాయమని, బీజేపీ-శివసేన-అజిత్ పవార్ కూటమికి గట్టి సవాలుగా విసిరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటన్నింటికీ తోడు ప్రాంతీయ పార్టీల్లో కట్టప్పలను ప్రోత్సహిస్తూ చిచ్చుపెడుతున్న కాషాయదళం వ్యూహాలకు చెక్ పెట్టవచ్చని కూడా ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రెండ్రోజుల క్రితం శరద్ పవార్ – రాహుల్ గాంధీ మధ్య జరిగిన చర్చలు విలీనం దిశగా తొలి అడుగు అని కొందరు నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే ముందు అజిత్ పవార్‌తో న్యాయపోరాటం చేసి గెలిచేందుకు సర్వశక్తులూ ఉపయోగించి ప్రయత్నిస్తారని, అది కుదరని పక్షంలోనే విలీనం చేస్తారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్ పవార్ లాంటి రాజకీయ ఉద్ధండుడినే ఊహించని రీతిలో దెబ్బకొట్టిన అజిత్ పవార్ కూడా తక్కువేం కాదు. శివసేన ఏక్‌నాథ్ షిండే నడిచిన బాటలో పార్టీ గుర్తు దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement