Friday, May 3, 2024

పులికాట్‌‌లోకి సముద్ర ముఖ ద్వారాన్ని తెరిచేందుకు చర్యలు.. ఎంపీ లావు ప్రశ్నకు కేంద్రం ఆన్సర్​

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని వాకాడు మండలం, రాయదరువు వద్ద పులికాట్‌ సరస్సులోకి సముద్ర ముఖ ద్వారాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) రూ.48కోట్లతో డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సమర్పించినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(డీజీపీఎస్‌) సర్వే నిర్వహించడానికి చట్టబద్దమైన అనుమతులు పొందినట్లు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసర్చ్‌ (ఎన్‌సీసీఆర్‌) ఏప్రిల్‌ 2022లో రూ.128.80కోట్లు అంచనా వ్యయంతో సర్వే నిర్వహించి డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు.

సాగరమాల పథకం కింద మొత్తం డీపీఆర్‌కు నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించినట్లు వివరించారు. రాయదరువు సమీపంలో సముద్ర ముఖ ద్వారాన్ని అమలు చేయడానికి పర్యావరణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు అధ్యయనాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మత్స్యకారుల సంఘాల మధ్య విబేధాల కారణంగా ఈ సముద్ర ముఖద్వారం అంశం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement