Sunday, April 28, 2024

షెల్టర్‌ జోన్లకు మావోయిస్టులు.. మైదాన ప్రాంతాల్లో పట్టుకు వ్యూహం

ఓ వైపు సమాధాన్‌.. మరోవైపు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌.. అన్నింటికీ మించి అగ్రనేతలు నేలకొరుగుతున్న నేపథ్యం.. లొంగుబాట్ల పర్వం.. కరోనా కారణంగా తలెత్తుతున్న అనారోగ్యాలు వెరసి మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మావోయిస్టుల అణచి వేతకు ప్రత్యేక బలగాలను రంగంలో దించటంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది.. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు క్యాడర్‌ షెల్టర్‌ జోన్లకు తరలివెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఏటా మార్చి నుంచి జూన్‌ వరకు ఆకులురాలే వేసవి కావటంతో అటవీ ప్రాంతాన్ని వీడి వెళుతుంటారు. అయితే ఈ సారి నిర్బంధం.. నిఘా నీడలు వెంటాడుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో మైదాన ప్రాంతాల్లో అనుబంధ, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట సాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పోలీసులకు సింహస్వప్నంగా మూడు చెరువుల నీళ్లు తాగించిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) తరహా యుద్ధ తంత్రంలో శిక్షణనిచ్చేందుకు పార్టీ కసరత్తు జరుపుతున్నట్లు తెలియవచ్చింది.. పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో యాక్షన్‌ టీంలను కొనసాగిస్తూనే మైదాన ప్రాంతాల్లో ఉద్యమానికి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.

పార్టీ కీలకనేత నంబాళ్ల కేశవరావు నేతృత్వంలో ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)తో తెలంగాణ, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర పరిధిలోని దండకారణ్యం, బస్తర్‌ ప్రాంతాల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగా క్యాడర్‌ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు చెప్తున్నారు. సోషల్ మీడియా మత్తులో జోగాడుతున్న యువతను ప్రజా సమస్యల దిశగా జాగృతం చేసేందుకు అదే మీడియాను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీతో పాటు అనుబంధ, విద్యార్థి సంఘాలపై నిషేధాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి.. పార్టీ పట్ల ప్రజల్ని ఆకర్షితపరిచే జననాట్య మండలి, సాహిత్యపరంగా విప్లవ రచయితల సంఘంపై సైతం నిర్బంధం అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో విప్ల‌వ సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు పార్టీలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది.

మావోయిస్టు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన చైనాలో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ధోరణుల వేళ్లూనుకున్నందున చైనాతో తెగదెంపులు చేసుకుంది.. భారత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతిక పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చిన విషయమై కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో పాటు దండకారణ్య ప్రాంతంలో ఉనికిని చాటుకునేందుకు కొత్త క్యాడర్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించేందుకు కసరత్తు జరుపుతోంది. పార్టీలో ఉన్న కోవర్టుల ను గుర్తించి ఏరివేయటంతో పాటు అంకితభావంతో ప్రజా సమస్యలపై స్పందించే ఉద్యమ నేపథ్యం కలిగిన యువతను ఆకట్టుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అటవీ ప్రాంతం మొత్తం పోలీసుల అధీనంలో ఉంది.. దీంతో యాక్షన్‌ టీంలను పంపేందుకు పార్టీ సాహసించట్లేదు.. దీనికితోడు నల్లమల ప్రాంతంలో ఆదివాసీలు కూడా తక్కువగా ఉన్నారు. ఏఓబీ, దండకారణ్య ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో హక్కుల ఉద్యమాలకు ఊతమివ్వడం ద్వారా వారిలో విశ్వసనీయతను చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొత్త జిల్లాలపై కూడా పార్టీలో ప్రస్తావన వచ్చినట్లు చెప్తున్నారు. ఏపీ సర్కార్‌ గిరిజన జిల్లాలను ప్రకటించి జిల్లా కేంద్రాలతో పాటు నామమాత్రంగా పరిశ్రమలకు భూముల కేటాయింపు, బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చే అవకాశాలు లేకపోలేదని, జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రియల్‌ అటవీ భూముల్లో సైతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ప్రయత్నాల్లో భాగంగానే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గిరిజన, ఆదివాసీ హక్కులకు భంగం కలుగకుండా వారితో మరింత మమేకం కావటం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు వ్యూరం సిద్ధం చేస్తోంది.. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలపడటం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం. కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో కొత్త క్యాడర్‌ సమీకరణ యత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ), అమరవీరుల వారోత్సవాల లోపు పార్టీకి పునరుజ్జీవం కల్పించి ఉనికిని చాటుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. ఈ నాలుగు నెలలు మైదాన ప్రాంతాల్లో షెల్టర్‌ జోన్లలో తలదాచుకుని జూలై నాటికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement