Tuesday, May 7, 2024

సిమెంట్‌ సరఫరా మా వల్ల కాదు.. రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలూ కారణమే

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం అమలుకు పెరుగుతున్న ధరలు అడ్డంకిగా మారుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో కీలకమైన వనరైన సిమెంట్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరల పెరుగుదలకు దేశీయంగా పలు సమస్యలకు అదనంగా రష్యా- ఉక్రెయిన్‌ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు కారణమవుతున్నాయి. దీంతో ఇళ్లు కట్టుకునేవారికి సి’మంట’ రేపుతోంది. ధరాభారంతో నిర్మాణ పనులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రేట్లకు సిమెంట్‌ అందించలేమని పలు కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం పంపిణీ చేస్తున్న కొన్ని కంపెనీల నుంచే ప్రస్తుతం సరఫరా జరుగుతోంది. ఒప్పందం మేరకు సరఫరా చేయని సంస్థలకు నోటీసులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అంచనా మించుతున్న వ్యయం..

రాష్ట్రంలో మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిని 2023 జూన్‌ నాటికి సిద్ధం చేసి, అందించాలని భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు 75 శాతం ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయి. మొత్తం మీద 11.65 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు జరిగాయి. అలాగే లే ఔట్ల వారీగా 11.44 లక్షల ఇళ్లకుగాను 8.55 లక్షలు గ్రౌండ్‌ అయ్యాయి. మరోవైపు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారు 4.16 లక్షల మంది ఉండగా.. 3.10 లక్షల గృహాలు గ్రౌండ్‌ అయ్యాయి. ఇళ్ల పనుల కోసం గృహ నిర్మాణ శాఖ నెలకు సగటున రూ. 300 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయితే ఇళ్ల పనుల్లో కీలకమైన సిమెంట్‌, ఐరన్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం నిర్ణయించిన లక్షా 80 వేల అంచనా మించుతోంది. దీంతో పనుల వేగానికి బ్రేకులు పడుతున్నాయి.

లబ్ధిదారుడిపైనే భారం..

రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. లక్షా 50 వేల నిధులు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 30 వేలు కలిపి ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేల చొప్పున అందించి, ఆ ఖర్చుతోనే నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సిమెంట్‌, ఐరన్‌ ధరల పెరుగుదలతో అంచనాలకు మించి వ్యయం కానుంది. దీంతో ఒక్కో ఇంటికి దాదాపు రూ. 20 నుంచి 30 వేల వరకు అదనపు ఖర్చు చేయాల్సి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రకటించిన రూ. లక్షా 80 వేలు మాత్రమే విడుదల చేయనుంది. దీంతో లబ్ధిదారులు పై ఖర్చు భరించాల్సి ఉంటుంది.

- Advertisement -

పలు కంపెనీలకు నోటీసులు..

సిమెంట్‌ ధరల పెరుగుదల కారణంగా ఇళ్ల నిర్మాణ పనులకు సరఫరా నిలిపివేసిన కంపెనీలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది. గృహనిర్మాణ శాఖ నిర్మాణ పనుల కోసం సిమెంట్‌, ఐరన్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు మూడు నెలలపాటు ఒప్పందంలో ఉన్న మేరకు సరుకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అనంతరం మరోసారి ధరలను సమీక్షించుకుని, మళ్లిd ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 235 నుంచి రూ. 245కి ఒక సిమెంట్‌ బ్యాగ్‌ చొప్పున కంపెనీలు సరఫరా చేయాలని ఒప్పందం ఉంది. అయితే ప్రస్తుతం రూ. 400 వరకు సిమెంట్‌ బ్యాగ్‌ ధరలు తాకుతుండటంతో పలు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ఎన్‌సీఎల్‌, సాగర్‌, జువారి, కేసీపీ, భవ్య సిమెంట్స్‌ తదితర కంపెనీలు ఈ ధరకు పంపిణీ చేయలేక సరఫరాను నిలిపివేశాయి. కేవలం మహా, భారతి సిమెంట్‌ మాత్రం సరఫరాను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరా నిలిపివేసని కంపెనీలకు నోటీసులు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరైన వివరణ రాకుంటే మున్ముందు టెండర్లకు ఆయా కంపెనీలను నిలిపివేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement