Saturday, May 4, 2024

భారత్‌లో గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల తయారీ.. 2024 నాటికి అందుబాటులోకి

ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ తన ప్రీమియం ఫోన్‌ అయిన పిక్సెల్‌ సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్నట్లు ప్రకటించింది. మేకిన్‌ ఇండియాలో భాగంగాఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ ఓస్టెర్లో తెలిపారు. గూగుల్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో గురువారం నాడు ఆయన ఈ ప్రకటన చేశారు. టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత్‌లో తయారైన పిక్సెల్‌ ఫోన్లు 2024 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయని రిక్‌ ఓస్టెర్లో తెలిపారు. భారత్‌లో ఫోన్ల ఉత్పత్తి కోసం అంతర్జాతీయ కాంట్రాక్ట్‌ తయారీ సంస్థలతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. గూగుల్‌ 2016 నుంచి అండ్రాయిడ్‌ ఆధారిత పిక్సెల్‌ ఫోన్లను తయారు చేస్తోంది. భారత్‌లో మాత్రం పిక్సెల్‌ 7 సిరీస్‌ నుంచి విడుదల చేయడం ప్రారంభించింది.

- Advertisement -

అంతకు ముందు వచ్చిన పిక్సెల్‌ 4,5,6 సిరీస్‌ ఫోన్లు నేరుగా భారత్‌ మార్కెట్‌లోకి రాలేదు. ఇటీవలే పిక్సెల్‌ 8 సిరీస్‌ ఫోన్లు 75,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదలయ్యాయి. ఈ సంవత్సరం మే నెలలో ఐటీ, టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కాలిఫోర్నియాలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో చర్చలు జరిపారు. భారత్‌లో తయారీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రణాళికలను ఆయనకు వివరించారు.

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా భారత్‌లో తయారీ గురించి సుందర్‌ పిచాయ్‌తో మాట్లాడారు. భారత్‌లో ఇప్పటికే యాపిల్‌ తన ఐఫోన్లను తయారు చేస్తోంది. 2023 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఏడు బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఫోన్లను యాపిల్‌ కంపెనీ తయారు చేసింది.

ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌, విస్ట్రోన్‌ వంటి కంపెనీలు ఇండియాలో యాపిల్‌ ఫోన్లను తయారు చేస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ తమ గెలాక్సీ ఫోన్లను కూడా భారత్‌లో తయారు చేస్తోంది. చైనాకు చె ందిన షావోమి స్మార్ట్‌ ఫోన్లను భారత్‌లో తయారు చేస్తోంది. తాజాగా గూగుల్‌ కూడా తన ఫోన్లను ఇక్కడ తయారు చేయాలని నిర్ణయంచడం వల్ల మన దేశంలో స్మార్ట్‌ ఫోన్ల తయారీ, ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement