Wednesday, May 22, 2024

ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌… గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణం

మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ ఎక్స్‌ పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (అక్టోబర్‌ 20న) రాజధాని ప్రాంతంలో దేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రారంభించనున్నారు. గంటకు 160కి.మీల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఢిల్లి-ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ రైలు పరుగులుతీయనుంది. అక్టోబర్‌ 21 నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ఐదు స్టేషన్ల (సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో) మీదుగా సర్వీసులందిస్తుంది.

ఇవి పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌. ప్రతి రైలులో 2-2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్‌ ఓపెనింగ్‌ మెకానిజం, ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఛార్జింగ్‌పాయింట్లు, డైనమిక్‌ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్‌ యాంబియంట్‌ లైటింగ్‌ సిస్టమ్‌, హీటింగ్‌ వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌తో పాటు అనేక సదుపాయాలు ఈ రైళ్ల ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసులందిస్తాయి.

- Advertisement -

ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర రూ.20 కాగా.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.100గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో పాటు కోట్‌ హుక్స్‌, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement