Sunday, December 8, 2024

Manipur Burning – దేశం నుదుటిపై మ‌ణిపూర్ మ‌చ్చ‌… మెజార్టీ ఓట్ల కోసం ఇంత దిగ‌జారుడా…

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్ర త్యేక ప్రతినిధి :మణిపూర్‌ మహి ళల నగ్నప్రదర్శన అంశం మొత్తం జాతిని ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండుమాసాలుగా మణిపూర్‌లో జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణల నివారణకు బీజేపీ నాయకత్వంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం సఫలం కాలేదు. పైగా కేంద్రం తమ పార్టీకి చెందిన మణిపూర్‌ ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌ చర్యల్ని వెనకేసుకురావడం జాతిని మరిం త విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘర్షణల్లో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మైతీ జాతికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌. మొత్తం మణిపూర్‌ ప్రజల్లో వీరిసంఖ్య 53శాతం. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ అంశాన్ని వీలైనంత తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. మే 4న మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా హైవేపై ఊరేగిం చడం, కొందరు వ్యక్తులు వారి శరీరభాగాల్ని బహిరంగంగానే చేతులతో తాకడం, అనంతరం ఒకరిపై సామూహిక అత్యాచా రానికి పాల్పడ్డం మొత్తం సభ్యసమాజం సిగ్గుతో బాధతో తలదించుకునే పరిస్థితుల్ని కల్పించింది.

మణిపూర్‌లోని కాంగ్‌కోక్వీ జిల్లా బిఫైనోమ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు బహిర్గతమైన తర్వాత కూడా కేంద్రం దీన్ని ఓ సాదాసీదా చర్యగానే పేర్కొంది. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ప్రధా ని పేర్కొనడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ అనుసూయ ఉ యికే దీనిపై తీవ్రంగానే విరుచుకుపడ్డారు. నిందితుల్ని వెంటనే అదు పులోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.



వాస్తవానికి గతరెండుమాసాల్లో మణిపూర్‌ జాతుల ఘర్ష ణతో అట్టుడుకిపోతోంది. మెజార్టీ వర్గమైన మైతీని గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ఈ ఏడాది మే 3న ఒక్కసారిగా జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. హిందువులైన మెజార్టీ మైతీయిలకు గిరిజనులైన మైనార్టీ కుకి, నాగ, మరికొన్ని జాతులకు మధ్య బీకర ఘర్షణలు చెలరేగాయి. గిరిజనులకు చెందిన చర్చిల్ని మైతీయిలు కూల్చేశారు. వారి గ్రామాల్ని దగ్ధం చేశారు. కొందరు మైతీయులైతే భద్రతా బలగాల వద్దనున్న ఆయు ధాల్ని దొంగిలించి మారణహోమానికి పాల్పడ్డారు. హైకోర్టు సూచించిన ఒక రోజు తర్వాత బిఫైనోమ్‌ గ్రామంపై మైతేయిలు దాడి చేశారు. గ్రామంలోని ఇళ్ళన్నింటిని తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీల్ని పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ మారణకాండకు భయపడ్డ ఓ కుటుంబం అడవిలోకి పారిపో వడంతో పోలీసులు వారిని రక్షించి స్టేషన్‌కు తీసుకెళ్తుం డగా తిరిగి మైతీలు దాడి చేశారు. 20, 40, 50ఏళ్ళున్న ముగ్గురు మహి ళల్ని తమ వెంట తీసుకెళ్ళారు. వీరిలో ఇద్దర్ని నగ్నంగా మార్చారు. హైవేపై ఊరే గించారు. అనంతరం 20ఏళ్ళ యువ తిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఎదురుగానే ఆమె తండ్రితో పాటు సోదరుడ్ని చంపేశారు.

ఈ సంఘటనల్ని కేవలం జాతుల మధ్య ఘర్షణగానే చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కేంద్రం కూ డా దీనికి వంతపాడింది. పైగా దాడుల వెనుక విదేశీ హస్త ముందంటూ నమ్మించే ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్‌, చైనా ల నుంచొచ్చిన ఉగ్రవాదులే మైతీల ముసుగులో ఈ దారు ణాలకు ఒడిగట్టినట్లు ఇంతకాలం ప్రపంచాన్ని నమ్మించింది. గత రెండుమాసాలుగా జరుగుతున్న దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం 140మంది చనిపోయారు. 50వేల మంది ఇళ్ళు కోల్పోయారు. వందలకొద్దీ చర్చిలు నేలమట్ట మ య్యాయి. వేల సంఖ్యలో ఇళ్ళు దగ్ధమైపోయాయి. అయినా ఈ చిన్ని రాష్ట్రంలోని వివాదాలపై కేంద్రం చిన్నచూపే చూసింది. కనీసం అదనపు బలగాల్ని మోహరించి జాతుల మధ్య ఘర్షణల్ని అణిచేసే ప్రయత్నం చేయలేదు. ఇది పరోక్షంగా ఇక్కడ మెజార్టీ మైతీ వర్గాల మద్దతు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రాకులాడుతున్నాయన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలే బీజేపీయేతర పార్టీల పాలనలో గల రాష్ట్రా ల్లో జరిగుంటే ఎప్పుడో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసుండేది. గవర్నర్‌ పాలన విధించుండేది. సైన్యాన్ని బరిలో దింపుండేది. ఘర్షణల్ని కఠినంగా అణిచేసుండేది. కానీ బీజేపీకి మణిపూర్‌లో మైతీ తెగల ఓట్లు అవసరం. ఈ కారణంగానే కేంద్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు మద్దతుగా నిల్చిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది.

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు కేవలం రిజర్వేష న్లకు సంబంధించినవి మాత్రమే కాదు. ఈ ఉద్రిక్తతలు దశా బ్దాల తరబడి మణిపూర్‌లోని లోయలు, కొండల మధ్య స్థిరపడ్డ కొండ జాతు లకు, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఏర్పా టు చేసుకున్న ఆధునిక నాగరికులకు మధ్య నెలకొన్న అపరిమిత ఆర్థిక వ్యత్యా సాల్ని కూ డా పరిగణనలోకి తీసుకోవాలి. ఒకప్పు డు అసోంలో ఉన్న ప్రాంతంలో అహోం రాజులు కొండ జాతుల ప్రయోజనాల్ని పరి రక్షించారు. వారికి ఉదారంగా భూ ములిచ్చారు. అవస రమైన సరుకుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. లోయ, మైదా నాల మధ్య ప్రజల్లో ఆదాయాన్ని సమ తుల్యత చేసేందు కు ప్రయత్నించారు. బ్రిటీష్‌ పాలనా కాలంలో కూడా ఇరుప్రాంతాల మధ్య విభజన సృష్టించేందుకు ఆసక్తి చూ పలేదు. అయితే మైదాన ప్రాంతాల్లోని మైతీలు అధిక నాగ రికతను ఒంటపట్టించుకున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 53శాతం ఉన్న మైతీలు మొత్తం రాష్ట్రంలో 10శాతం మైదాన ప్రాంతాలకే పరిమితమయ్యారు. మిగిలిన 90శాతం రాష్ట్రం కూడా కొండలు, లోయలతో కూడినదే. ఇక్కడే నాగాలు, కుకిలు మరికొన్ని గిరిజన జాతులు జీవిసు ్తన్నాయి. చారిత్రక ఆధారాల మేరకు నాగాలు, మైతీలు ఈ రాష్ట్రంలో ఆదినుంచి స్థిరపడ్డారు. బ్రిటీష్‌ పాలనాకాలంలో కుకీలు నెమ్మదిగా ఇటువైపు పలసొచ్చారు.
ఈ తెగల మధ్య సమతుల్యతకు గతంలో జరిగిన ప్రయత్నాలు దేశానికి స్వా తంత్య్రం వచ్చిన అనంతరం సన్నగిల్లాయి. కొండలు మిశ్రమ జనాభాప్రాంతాలుగా మారాయి. గిరిజనుల్ని మైదాన ప్రాం తంలోకి మైతీలు అనుమతించలేదు. దీంతో మతం మరియు సంస్కృతుల ఆధారంగా ఇక్కడ జాతుల విభ జన పెరిగింది. ఇది తరచూ ఘర్షణలకు తావిచ్చింది. నాగాలు, కుకీలు వ్యవ సాయంపైనే ఆధారపడ్డారు తరచూ వీరు యాజమాన్య హక్కుల సమస్యను ఎదుర్కొన్నారు. వారి గ్రామాల విస్తరణకు రాజకీయంగా పలుకుబడి కలిగిన మైతీలు అనుమతించలేదు. దీంతో కుకీలు, నగాలు మరింత లోతట్టు లోయలు, కొండల్లోకి తరలిపోక తప్పలేదు. అంచెలంచెలుగా కొండల్లోని ప్రక ృతి వనరులపై మైతీల కన్నుపడింది. వీర్ని అక్కడ్నుంచి ఖాళీ చేయించి ఆ భూభాగాన్ని కూడా సొంతం చేసుకునే కుట్రలు సాగించారు. ఇది జాతుల మధ్య ఘర్షణకు మరింత ఆజ్యం పో సింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాము గిరిజన హోదా పొందితే కొండలు, లోయల్లోని ప్రకృతి వనరుల్ని కబ్జా చేయోచ్చని మైతీ వర్గం తలపోసింది. ఇందుకోసం చేసిన ప్రయత్నంలో భాగం గానే రాష్ట్ర హైకోర్టు నుంచి సూత్రప్రాయంగానైనా తమ కనుకూలమైన నిర్ణయాన్ని తెచ్చుకోగలిగింది. ఇది సహజం గానే కుకీలు, నాగాల్లో అభద్రతా భావాన్ని పెంచింది. తమ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందన్న ఆందోళన వార్ని తిరుగు బాటుకు ప్రేరేపించింది. అయితే రాజకీయ, సామాజిక, ఆర్ధిక బలాలున్న మైతీల ముందు ఈ గిరిజన తెగలు నిల దొక్కుకోలేకపోతున్నాయి. పైగా ప్రభుత్వం కూడా మైతీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోంది.
మణిపూర్‌లో శాంతి నెలకొల్పడం ఆ రాష్ట్రానికే కాక మొత్తం భారత్‌కు అవసరం. ఏమాత్రం అప్రమత్తత కొరవడ్డా విదేశీ శక్తులు ఇక్కడ ప్రాభల్యం పెంచుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే మణిపూర్‌లోని వివిధ గిరిజన జాతులు రాష్ట్ర ప్రభు త్వంపై విశ్వాసం కోల్పోయాయి. విపక్ష ఎమ్మెల్యేలు బహి రంగంగానే రోడ్లపైకెక్కి తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ కూడా తన అసమర్ధతను నిరూ పించుకున్నారు. ఈ దశలో కేంద్రం ఓటు బ్యాంక్‌, హిందుత్వ రాజకీయాల్ని పక్కనపెట్టి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. పరిమితి లేకుండా పథాతిదళాల్ని ఆ రాష్ట్రానికి తరలించాలి. శాంతిభద్రతల్ని పునరుద్దరించాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement