Tuesday, April 30, 2024

Breaking | పోలీస్‌స్టేషన్‌ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం.. సంగారెడ్డి ఆస్పత్రికి తరలింపు

జోగిపేట, (ప్రభన్యూస్): తనపై దాడిచేసిన వారిని పట్టించుకోని కారణంగా ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌ ముందు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగిపేట రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న ఖలీల్ (40) బసవేశ్వర విగ్రహం వద్ద తనపై దాడి చేసి ఫోన్‌ పగలగొట్టారని 100 డయల్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుల్‌లు ఫిర్యాదు చేసిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఖలీల్‌ తప్ప మిగతా ఎవరూ లేకపోవడంతో గొడవ జరిగిన విషయాన్ని ఆ ప్రాంతానికి చెందిన వారిని ప్రశ్నించారు. గొడవ జరిగింది వాస్తవమే కాని, వారెవరో తమకు తెలియదన్నారు.

దీంతో పోలీసులు స్టేషన్‌కు ఖలీల్‌ను తీసుకువచ్చి సర్దిచెప్పి ఉదయం పిలిపిస్తామని చెప్పి పంపించారు. కొద్దిసేపటికే ఖలీల్‌ స్టేషన్‌ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసుకొని నిప్పంటించుకొని స్టేషన్‌లోకి పరుగులు తీసారు. స్టేషన్‌లోనే ఉన్న సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్‌ బయటకు వచ్చి సిబ్బందితో మంటలను ఆర్పివేయించారు. వెంటనే ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. సీఐ, ఎస్‌ఐలు ఆసుపత్రికి వచ్చి ఖలీల్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement