Friday, May 3, 2024

Big Story | వానాకాలం సాగుకు విత్తనాలు రెడీ.. 18లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మరో 20 రోజుల్లో 2023-24 వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, సోయా తదితర పంటల సాగుకు గాను 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని ఇప్పటికే వ్యవసాయశాఖ అంచనా వేసింది.

ఈ ఏడాది కూడా వరి దాదాపు 50శాతానికి పైగా విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసిన నేపథ్యంలో తెలంగాణ సీడ్స్‌ ఆధ్వర్యంలో దాదాపు 9లక్షల క్వింటాళ్లకు పైగా వివిధ రకాల సన్న, దొడ్డురకం వరి ధాన్యం వంగడాలను అందుబాటులో ఉంచారు. మరో 5లక్షల క్వింటాళ్ల మేర పత్తి విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మిగతా 4 లక్ష ల క్వింటాళ్లు మేర కంది, పెసర, మినుము, మొక్కజొన్న, సోయా, మిర్చి తదితర విత్తనాలకు డిమాండ్‌ ఏర్పడనుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రానున్న వానాకాలం సీజన్‌కు 15 రకాల వరి వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. దొడ్డు, సన్న రకాలకు సంబంధించిన కొత్త, పాత వంగడాలను రైతుల డిమాండ్‌ మేరకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసి ఉంచింది. 25 కిలోల బస్తా రూపంలో విత్తనపు వడ్లు సరఫరా కానున్నాయి. ఈ ఏడాది కొత్త కేఎన్‌ఎం-1638 వరి వంగడాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 125రోజుల్లో దిగుబడి వచ్చే సన్నరకం వరి ధాన్యం విత్తనమని తెలిపారు. గింజ పొట్టిగా, దొడ్డుగా ఉంటుందని, మంచి దిగుబడి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

అదేవిధంగా… వరి ఎంటీయూ 1011, ఎంటీయూ 1001, ఎంటీయూ 1262, ఎంటీయూ -1061, ఆర్‌ఎన్‌ఆర్‌-29325, కేఎన్‌ఎం-118, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్‌-962, పీఎన్‌ఆర్‌-29325 తదితర రకాల వరి విత్తన వంగడాలు అందుబాటులో ఉంచింది. పప్పు దినుసుల విత్తనాలను 4 కిలోల సంచుల్లో అందుబాటులోకి తెస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు, నువ్వులు తదితర విత్తనాలను ఆయా ప్రాంతాల్లో గుర్తింపు పొందిన రైతు సహకార సొసైటీలు, డీసీఎంఎస్‌లు, ఆగ్రోస్‌ సంస్థల ద్వారా పొందొచ్చని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement