Tuesday, May 7, 2024

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌! బెల్లంతో రాగి జావ ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అల్పాహారాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు నడిచే అన్ని రోజుల్లో రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విద్యార్థులకు బెల్లం, రాగి జావతో కూడిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభమైన మొదటి రోజునుంచే ఈ కార్యక్రమం అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలను చేర్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా శాఖల అధికారులతో చర్చించిన తర్వాత తృణధాన్యాల అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బెల్లం పొడి, రాగి పిండిని ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖ అందజేయనుండగా మధ్యాహ్న భోజన పథకం కుక్‌ కమ్‌ హెల్పర్లు రాగి జావను తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజనం మెనూలో సరికొత్తగా వారంలో ఒక రోజు వెజిటెబుల్‌ బిర్యానీని విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

పోషకాహార లోపం వల్లే?

- Advertisement -

గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతుండడంతో పాటు- జబ్బుల బారిన పడుతున్నారని, దీంతో చిన్నారుల్లో ఎదుగుదల ఉండడం లేదని వివిధ అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువగా ఉండడంతో వారు పిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే పిల్లల్లో అధికంగా చిన్న, సన్నకారు రైతుల పిల్లలు, దినసరి కూలీలు, పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన పిల్లలు అధికంగా ఉండడం.. వారు ఇళ్లలో మంచి బలీయమైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే పాఠశాలల్లో తృణధాన్యాలను, రాగి జావ లాంటి ఆహారాన్ని ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు- అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఉదయం టిఫిన్‌లో అల్పాహారాన్ని ప్రవేశపెట్టడం, వారంలో ఒకరోజు వెజి-టెబుల్‌ బిర్యానీ, తృణధాన్యాలకు సంబంధించి పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి ఆ మొత్తాలను జిల్లా కలెక్టర్లకు పంపించే విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ కొత్త కార్యక్రమాల అమలు కోసం త్వరలో విద్యశాఖాధికారులతో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్టు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement