Friday, April 26, 2024

ములుగు జిల్లాకు మహర్దశ.. జిల్లా కేంద్రంలో బస్‌ డిపో మంజూరు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ములుగు జిల్లాకు మహర్ధశ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు. ములుగు నియోజకవర్గ ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ములుగులో బస్‌ డిపోను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. ఉమ్మడి జిల్లాలో వరంగల్‌ కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరం వరకు ములుగు నియోజకవర్గం విస్తరించి ఉండేది. జిల్లా కేంద్రానికి రావాలన్నా బస్‌ సౌకర్యాలు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేది. రాత్రి పూట మరీ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ములుగు నియోజకవర్గంలో బస్‌ డిపోను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపించింది. అదికూడా ఏటూరునాగారం కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అక్కడ డిపోకు స్థలం కూడా కేటాయించారు. అయితే ఏటూరునాగారం పూర్తిగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో ముందుకు పోలేదు. కొత్తగా పరకాల, భూపాలపల్లి, తొర్రూర్‌ కేంద్రాలలో బస్‌ డిపోలు ఏర్పడినా ములుగు జిల్లా నోచుకోలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఏటూరునాగారం పర్యటనలో ములుగు జిల్లాకు బస్‌ డిపోను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ములుగు జిల్లా ప్రజల కలసాకారమైంది.

గ్రామ పంచాయతీని జిల్లాగా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్‌దే దేశ చరిత్రలోనే ఒక గ్రామ పంచాయతీని జిల్లాగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ములుగును జిల్లాగా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయినా ములుగు నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేక తీర్పును ఇచ్చినప్పటికి మలివిడత ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ములుగును జిల్లాగా చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ములుగు గ్రామ పంచాయతీని కూడా నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఏటూరునాగారంలో ఫైర్‌ స్టేషన్‌, డయాలిసిస్‌ కేంద్రం
ములుగు జిల్లా కేంద్రంలో ఒక అగ్నిమాక కేంద్రం ఉన్నప్పటికి జిల్లా విస్తీర్ణంలో అతి పెద్దగా వుండడంతోపాటు వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి నష్టం జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే ఏటూరునాగారంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసే విధంగాచూడండంగా డిజిపి మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. అదే విధంగా ఏటూరునాగారం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యాధులు, రోగాల భారినపడుతున్నారని చెబుతూ ఇక్కడ డయాలిసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను వెంటనే అయ్యే విధంగా చూడాలంటూ ఆదేశించారు. పదిహేను రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఏటూరునాగారంలో పీజి కళాశాలకు కూడా సిఎం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చారు.

ఇప్పటికే ములుగు కేంద్రంగా మెడికల్‌ కళాశాల మంజూరు
ములుగు జిల్లా కేంద్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే ములుగు జాకారంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందు పరిచే విధంగా కేసీఆర్‌ కృషి చేశారు. అది కార్యరూపం దాల్చినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో ప్రారంభానికి ఆలస్యమైతుంది. ములుగులో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం పర్యటనలో ఎమ్మెల్యే సీతక్క అడిగిందే తడువుగా అన్నింటినీ మంజూరు చేశారు. ములుగు జిల్లాలో అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తంగా ములుగు జిల్లాకు మంచిరోజులు రాబోతున్నాయని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర రైతుబంధు చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ములుగు జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్‌ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతులు తెలియజేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement