Monday, April 29, 2024

త్వరలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు.. సర్వే ప్రారంభించిన మెఘా ఇంజనీరింగ్‌

కృష్ణా, ప్రభన్యూస్‌ బ్యూరో : మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన కోర్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్‌ సంస్థ సర్వే పనులు ప్రారంభించింది. సముద్ర తీర ప్రాంతంలో భూ నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తోంది. బెర్తులు ఎంత లోతులో నిర్మిస్తే పటిష్టంగా ఉంటాయో గుర్తించేందుకు మట్టి శాంపిల్స్‌ తీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు తుది దశకు చేరింది. మొదటి దశలో మూడు కార్గో, ఒకటి సాధారణ బెర్త్‌లను నిర్మించనున్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రవాణాకు ప్రత్యేకంగా ఒక బెర్త్‌ ను కేటాయిస్తున్నారు.

ఈ నాలుగు బెర్తుల నిర్మాణానికి మొత్తం రూ.5,253.89 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించారు. రూ.3,683.83 కోట్లకు మెఘా సంస్థ టెండర్‌ తగ్గించుకుంది. పనులు ప్రారంభమైన తర్వాత 30 నెలల్లో పోర్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి ఇప్పటికే పర్యావరణ అనుమతులు వచ్చాయి. మచిలీపట్నం పోర్టు కు జాతీయ పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ.3940 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన సముద్ర తీర ప్రాంత భూముల సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను రెవిన్యూ శాఖ పూర్తి చేసింది. నాలుగు గ్రామాల్లో 1,688.44 ఎకరాలను సబ్‌ డివిజన్‌ చేసింది.

- Advertisement -

మంగినపూడి గ్రామంలో 185 సర్వేనెంబర్‌ లో 806.75 ఎకరాలు, తవిసేపూడి గ్రామంలో 139 సర్వేనెంబర్‌ లో 312.38 ఎకరాలు, గోపువారిపాలెంలో 152 సర్వేనెంబర్‌ లో 413.48 ఎకరాలు, కరగ్రహారంలో 335 సర్వేనెంబర్‌ లో 138.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. నూతనంగా ఈ భూములకు సర్వే నెంబర్లు కేటాయించింది, భూసేకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ భూములను పోర్టు నిర్మాణ నిమిత్తం మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు రెవెన్యూ అధికారులు అప్పగించారు. అలాగే, పోర్టుకు అనుసంధానంగా కోస్తా జాతీయ రహదారి 216, పెడన రైల్వే స్టేషన్‌ కు రైలు, రోడ్డు కనెక్టివిటీ-కి 103.69 అవసరం. గతంలో మచిలీపట్నం పట్టణాభివృద్ధి సం( ము) సేకరించిన భూములు మెరైన్‌ డివిజన్‌కు బదిలీ చేసింది. ముడ గతంలో 659 ఎకరాలను భూసేకరణ చేసింది.

ఇందులో రైల్‌ రోడ్డు కనెక్టివిటీ-కి 55.37 ఎకరాలు బదిలీ చేసింది. మరో 48.38 ఎకరాల భూసేకరణకు ఇటీవల ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భూముల ధర నిర్ణయం పై భూ యజమానులతో అధికారులు చర్చిస్తున్నారు. ధర విషయంలో భూ యజమానులు ఆమోదం పొందిన తర్వాత ఈ భూముల సేకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. భూసేకరణ అవసరమైన నిధులను రూ.90 కోట్లు మారిటైం బోర్డు తాజాగా విడుదల చేసింది. 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో రైల్‌, రోడ్‌ కనెక్టివిటీకి కోసం భూసేకరణకు మార్గం సుగమమైంది, సర్వే నివేదికలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు మెఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement