Sunday, May 5, 2024

కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35వేల కోట్లు దండగ అన్న వైసీపీ ఎంపీ

దేశంలో కరోనా టీకాల పేరుతో రూ .35 వేల కోట్లు వృథా చేయవద్దని ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన లోక్‌సభ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సింగారి బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్ పాజిటివ్ కేసులను అధిగమించడానికి కోవిడ్ టీకా కవరేజీని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను కోరినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రభుత్వం రూ.35వేల కోట్లు వృథా చేయకూడదని వృత్తి రీత్యా డాక్టర్ అయిన సంజీవ్ కుమార్ అన్నారు. దానికి బదులుగా ఆ డబ్బును దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

ప్రతి ఒక్క వ్యక్తికి టీకాలు వేయడం సాధ్యం కానందున వ్యాక్సినేషన్ ప్రక్రియకు రూ.వేల కోట్లు ఖర్చు చేయడం దండగ అన్నారు. పార్లమెంటులో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిధుల కోసం డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 టీకా కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.35 వేల కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే వందేళ్లకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కరోనా సోకిన 60 శాతం మంది ప్రజలు రోగనిరోధక శక్తితో వైరస్‌ను జయించారని.. అలాంటి వారికి టీకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. విశేషం ఏంటంటే.. ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురు సభ్యులు గతంలో కరోనా వైరస్ బారిన పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement