Sunday, May 5, 2024

సుప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం.. మొదటిసారి రాజ్యాంగ ధర్మాసనంపై చ‌ర్చ‌

భారత దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త శకం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణలు ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించింది. దేశ ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన రాజ్యాంగానికి సంబంధించిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం ప్రజలకు లభించింది. రాజ్యాంగ ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాలు లేదా వెబ్‌ కాస్ట్‌ ద్వారా ప్రసారం చేయాలని సెప్టెంబర్‌ 27, 2018న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇచ్చిన ల్యాండ్‌ మార్క్‌ జడ్జిమెంట్‌ నేడు కార్యరూపం దాల్చింది. మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టులో మూడు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయి. అందులో జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రెండవ రాజ్యాంగ ధర్మాసనం శివసేన వర్సెస్‌ శివసేన కేసును విచారించింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించిన ఉద్ధవ్‌ థాక్రే శివసేన వర్సెస్‌ ఏక్‌నాథ్‌షిండే శివసేన కేసును జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారించింది.

మరో రెండు ధర్మాసనాలకు ముందుకు ఈడబ్ల్యుఎస్‌ కోటా, ఆలిండియా బార్‌ ఎగ్జామ్‌ చెల్లుబాటులపై విచారణలు జరిగాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్‌ మరియు జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌లతో కూడిన ద్విసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఈడబ్ల్యుఎస్‌ ఎస్‌ కోటాపై విచారణతో పాటు ఆలిండియా బార్‌ ఎగ్జామ్‌ చెల్లుబాటుపై కూడా విచారించింది. శివసేన వర్సెస్‌ శివసేన కేసును ఈ ఏడాది ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఏక్‌నాథ్‌ షిండే మరియు ఉద్ధవ్‌ థాక్రే శివసేనలకు సంబంధించిన కేసుల్లో ఫిరాయింపు, విలీనం, అనర్హతలకు సంబంధించి ఎనిమిది ప్రశ్నలను న్యాయస్థానం ఫ్రేమ్‌ చేసింది.ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. అనంతరం ప్రత్యక్ష ప్రసారం ద్వారా విచారించాలని మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు విచారణలను ప్రజలు సెల్‌ఫోన్స్‌, లాప్‌టాప్స్‌, కంప్యూటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించడానికి త్వరలో ప్రత్యేక సర్వర్‌ను హోస్ట్‌ చేయనుందని సీజేఐ యుయు లలిత్‌ ప్రకటించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత అధ్యక్షతన ఇటీవల 30 మంది న్యాయమూర్తులతో నిర్వహించిన ఫుల్‌ కోర్టు సమావేశంలో ఈనెల 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న జస్టిస్‌ మిశ్రా తీర్పు నాలుగు సంవత్సరాల తర్వాత కార్యరూపం దాల్చింది. రాజ్యాంగపరమైన ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లేదా వెబ్‌కాస్ట్‌ ద్వారా ప్రసారం చేయాలని సెప్టెంబర్‌ 27, 2018న స్వప్నిక్‌ త్రిపాఠీ కేసు విచారణ సందర్భంగా, అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రా ల్యాండ్‌ మార్క్‌ తీర్పు వెలువరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement