Thursday, May 2, 2024

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయండి : హరీశ్ రావు

హైదరాబాద్ : ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల‌ని మంత్రి హ‌రీశ్ రావు కేంద్రాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్రానికి పోస్టు కార్డు రాశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో హరీష్ రావు ఈ పోస్టు కార్డు రాశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోంది. గత ఏడాది 30 వేల కోట్ల బడ్జెట్ కోత విధించారు. దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయ‌న్నారు. వ్యవసాయ కూలికి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ, ఒక్కో కూలికి వంద రూపాయలకు మించడం లేద‌న్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేద‌న్నారు. కనీస వేతన చట్ట ప్రకారం 8 గంటలు పని చేసిన కూలికి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ గిట్టడం లేద‌న్నారు. ఆన్ లైన్ పద్ధతి వల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ లో అప్ లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారు. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. సన్న,చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారు. కాబట్టి వ్యవసాయం అనుసంధానం చేయటం వల్ల రైతులకు కూలి గిట్టుబాటు అవుతుంద‌న్నారు. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పనిదినాలు కల్పించాన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాల‌న్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏపిఓల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఆ పోస్టు కార్డులో రాశారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఈ నెల 8వ తేదీన నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుంచి ఈ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement