Friday, May 3, 2024

Spl Story : ట్రిపుల్ ఐటీలో రాలిపోయిన “లిఖిత, దీపిక”లు

  • రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరి ఆత్మహత్య
  • ఆత్మహత్యలకు కారణాలు దొరికేనా..?
  • ట్రిపుల్ ఐటీ పంపాలంటేనే జంకుతున్న విద్యార్థినిల తల్లిదండ్రులు
  • ఇప్పటికి 20కి పైగా ఆత్మహత్యలు

బాసర, ప్ర‌భ న్యూస్ : గంపెడు ఆశలు పెట్టుకుని, భవిష్యత్తు మీద ఆశలు పెంచుకొని కన్న తల్లిదండ్రుల కలలు సహకారం చేద్దామని ట్రిపుల్ ఐటీలో చేరిన కొందరు విద్యా కుసుమాలు.. ఆశలు తీరకుండానే ప్రాణాలు పోగొట్టుకొని రాలిపోతున్నారు. ట్రిపుల్ ఐటీ స్థాపించిన నాటి నుండి కారణాలు ఏదైనా ఇప్పటికీ దాదాపు 20కి పైనే విద్యార్థిని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకు కారణం పోటీ ప్రపంచంలో నెగ్గుకోకపోకుండా ఉండడమా..? లేక అధికారుల, సిబ్బంది వేధింపుల..? మానసిక ఒత్తిడి కారణాల..? అంతుపట్టడం లేదు. ఏదేమైనా బాసర ట్రిపుల్ ఐటీ మాట ప్రతి ఏడాది ఏదో ఒక చర్చనీయ అంశంతో వార్తలలో నిలుస్తూనే ఉంది.

రెండు రోజుల వ్యవధిలోనే రాలిన “లిఖిత, దీపిక”లు
కన్న తల్లి, తండ్రుల కలలు సహకారం చేసుకుంటారని వచ్చిన దీపికా, లిఖితలు రెండు రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి శోకాన్ని మిగిల్చారు. పియుసి ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్ల దీపిక బాత్రూం వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా… పీయూసీ ఫస్టియర్ చదువుతున్న మరో విద్యార్థిని లిఖిత నాలుగు అంతస్తులపై మేడనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వీళ్ల చావులకు గల కారణాలను ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఇప్పటికీ తెలపడం లేదు.

ఇప్పటికీ 20కి పైనే ఆత్మహత్యలు..?
ట్రిపుల్ ఐటీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ దాదాపు 20కి పైనే విద్యార్థిని, విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గడిచిన నాలుగు సంవత్సరాలలో అంటే 2020లో సంజయ్ అనే విద్యార్థి భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ‌గా, 2022లో రాథోడ్ సురేష్, భాను ప్రసాద్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోన్నారు. 2023లో దీపిక ఉరి వేసుకోగా, లికిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకు కుటుంబమే కారణామా..? లేక మానసిక ఒత్తిడా.? పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోవడమా..? ఇప్పటికీ తెలియదు.

జంకుతున్న తల్లిదండ్రులు
విద్యార్థిని, విద్యార్థులను ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో జాయిన్ చేద్దామంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో బాసర ట్రిపుల్ ఐటీ పేరు వార్తలు నిలుస్తూనే ఉంది. గత సంవత్సరం విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆందోళన చేయగా, సమస్యలు నెరవేరుతాయని హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పటికీ అవి తీరడమేలేదు. వరుస ఆత్మహత్యలను చూస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ట్రిపుల్ ఐటీ లో పంపాలా..? వద్దా..? అంటూ ఆలోచిస్తున్నారు.

కౌన్సిలింగ్ క్లాస్లు తప్పక అవసరమే..!
ఉన్నత లక్ష్యంతో ట్రిపుల్ ఐటీలో అడుగుపెట్టిన విద్యార్థిని, విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా కౌన్సిలింగ్ క్లాసులు కంపల్సరీ అవసరమే..! మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా కౌన్సిలింగ్ క్లాసులను యాజమాన్యం నిర్వహించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement