Sunday, April 28, 2024

విమాన చార్జీల పరిమితి ఎత్తివేత.. ఇక‌మీద‌ట ఆ నిర్ణయం సంస్థల ఇష్టమేనన్న కేంద్రం

కోవిడ్‌ సమయంలో దేశీయ విమాన ఛార్జీలపై విధించిన పరిమితిని ప్రభుత్వం ఈ నెల 31 నుంచి ఎత్తివేయనుంది. 27 నెలలుగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై పరిమితి కొనసాగుతున్నది. విమాన ఇంధన రేట్లు తగ్గుతున్నందున అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదీత్య సింథియా బుధవారం నాడు వెల్లడించారు. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ప్రారంభ రోజుల్లో విమాన ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతం అవి తగ్గుతున్నాయి. ఈ నెల 1న విమాన ఇంధనం కిలోలీటర్‌ లక్షా 21 వేల రూపాయలు ఉంది. గత నెలతో పోల్చితే ఇది 14 శాతం తక్కువ.

కోవిడ్‌ కాలంలో 2020 మే 25న కేంద్ర విమానయాన శాఖ దేశీయ విమాన ఛార్జీలపై కనిష్ట, గరిష్ట రేట్లపై నియంత్రణ విధించింది. దీని ప్రకారం విమానయాన సంస్థలు జీఎస్టీతో కలిపి 2,900 రూపాయల కనీస ఛార్జీగా వసూలు చేయాల్సి ఉంటుంది. దీనికంటే తగ్గించే అవకాశం లేదు. గరిష్టంగా 8,800 వసూలు చేసుకోవచ్చుని నియంత్రణ విధించారు. తాజాగా ఈ నియంత్రణను ఆగస్టు 31 నుంచి ఎత్తివేయనున్నట్లు మంత్రి ట్విట్టర్‌లో వెల్లడించారు. గరిష్ట ఛార్జీలను ఏదో పేరుతో ప్రయాణీల నుంచి అధిక మొత్తాలను వసూలు చేయకుండా నిరోధించేందుకు విధించారు. కనీస ఛార్జీలను చిన్న విమానయాన సంస్థలు నష్టపోకుండా విధించారు. దీన్ని ఎత్తివేస్తున్నందున ఛార్జీల నిర్ణయం ఆయా విమానయాన సంస్థలు నిర్ణయంచుకోనున్నాయి.

అన్ని సంస్థలు ప్రయాణ సమయంలో కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నియంత్రణ ఎత్తివేసిన తరువాత ఈ రంగంలో పోటీని బట్టి ఆయా సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పీక్‌ డిమాండ్‌ ఉన్న సమయంలో మాత్రం బాదుడు కూడా ఉంటుందని మరికొంత మంది గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement