Saturday, May 11, 2024

Delhi | సమిష్టిగా పనిచేద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం.. రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో పేదరిక నిర్మూలనలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తూ 70 వేల మందికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందజేశారు. జాతీయ రోజ్‌గార్ మేళా కింద చేపట్టిన ఈ నియామకాలు రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తపాలా శాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, రక్షణ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జల వనరులు, పర్సనల్ అండ్ ట్రైనింగ్, హోం మంత్రిత్వ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని మూలల నుంచి ఈ ఖాళీల భర్తీ కోసం ఎంపిక జరిగింది. నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాని మోదీ ఏకకాలంలో దేశంలోని 44 ప్రాంతాలను మేళాతో అనుసంధానం చేసి ప్రసంగించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1947లో తొలిసారిగా ప్రస్తుత రూపంలో జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజున 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని, వారంతా దేశం పేరు – ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 సంవత్సరాలు కొత్త ఉద్యోగులకు, దేశానికి చాలా కీలకమని, ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ దేశాలకు భారతదేశం పట్ల పెరిగిన విశ్వాసం, ప్రాముఖ్యత, ఆకర్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా భారత్ ప్రపంచంలోని మొదటి మూడు బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారబోతోందని ఆయన పునరుద్ఘాటించారు.

అమృత్ కాల్ లో దేశానికి సేవ చేసే సువర్ణావకాశం కొత్త అధికారులకు లభించిందని, ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలను పరిష్కరించి జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం, వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తమను తాము అనుసంధానం చేసుకోవడం వారి ప్రాధాన్యాంశాలుగా ఉండాలని ఆయన సూచించారు. “మీ నుండి ఒక చిన్న ప్రయత్నం మరొకరి జీవితంలో ఒక పెద్ద మార్పును సృష్టించగలదు”, అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజలు దేవుని రూపమని, వారికి సేవ చేయడం దేవుని సేవతో సమానమని అన్నారు. నూతన ఉద్యోగులు ఇతరులకు సేవ చేయాలనే నమ్మకంతో పనిచేయాలని, తద్వారా గొప్ప సంతృప్తిని పొందాలని ఆయన ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement