Tuesday, May 28, 2024

Big Story | విస్తారంగా వర్షాలు… జోరుగా వరి నాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరినాట్లు జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు వరి నాట్లలో బిజిబిజీ అయ్యారు. వాస్తవానికి ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో వరిసాగుపై రైతులు ఆశలు వదులుకున్నారు. కొందరు రైతులు బావులు, బోర్ల నీటితో నారు మడి సాగు చేశారు. నారు ముదురుతోందని, మరో వారం దాటితో ఇక వరిసాగుపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు అనుకుంటున్న తరుణంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరిసాగుకు ఊపిరిపోశాయి.

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గడిచిన రెండు రోజుల్లో దాదాపు 15లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40లక్షల ఎకరాల్లో వరినాట్లు పడతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరినారు నాట్లకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరవులు, కుంటలు నిండడంతోపాటు భూగర్భ జలాలు కూడా వృద్ధిచెందాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కురుస్తున్న వర్షపునీటిని మళ్లలో కట్టలు వేసి ఆ నీటితోనే పొలం దున్నకాలను పూర్తి చేసి వరి నాట్లు వేస్తున్న దృశ్యాలు ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో కనిపిస్తున్నాయి. మరోవైపు సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు మరో నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశోఖ సూచనల నేపథ్యంలో రైతులు కొత్తగా వరినార్లు పోస్తున్నారు. ఆగస్టు 15 వరకు వరినాట్లు వేసేందుకు అవకాశం ఉండడంతో ఆలస్యమైనా వరిసాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఈసారి వర్షాలు కాస్త అటు ఇటు అయినా పరిస్థితి గత వానాకాలంగానే ఉందని రైతులు చెబుతున్నారు.

వర్షాలు ఆలస్యంగా పడుతున్నందువల్ల కాలువలు, చెరువు, కుంటల కింద రైతులు స్వల్పకాలిక వరిరకాల సాగువైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. తెలంగాణ సోనా, 1010 వంటి రకాలు 125 రోజుల్లో కోతకు వస్తాయని రైతులు ఈ స్వల్పకాలిక వరి రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆలస్యంగానైనా వర్షాలు ఉన్నట్టుండి కురవడంతో రైతులంతా వరినాట్లకు సిద్ధమవడంతో నాటు వేసేందుకు కూలీల కొరత ఏర్పడుతోంది.

సాగు విస్తీర్ణం పెరగడంతో కూలీల కొరత తీవ్రమైంది. రైతులంతా ఒకేసారి వరినాట్లకు సిద్ధమవడంతో కూలీలు నాటు గుత్తాను పెంచారు. ఎకరాకు రూ.5వేలు ఇస్తేగాని నాట్లు వేసేది లేదని రైతులకు తెగేసి చెబుతున్నారు. కూలీల కొరత కారణంగా సరైన సమయంలో నాటు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగానైనా వర్షాలు కురిశాయన్న సంతోషంలో రైతులు కూలీలు అడిగినంత ఇచ్చి మొత్తానికి వరినాట్లను పూర్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement