Saturday, May 18, 2024

క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతో నాయకత్వ లక్షణాలు.. విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి మంగళవారం ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే ఇందుకోసం కష్టించి పనిచేయడంతోపాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమన్నారు.

ఇతరులు చెప్పే అంశాలను ఓపికగా వినడం కూడా నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనదన్నారు. చిన్న చిన్న సంతోషాలను పక్కనపెట్టి పరిస్థితులను, పెద్దల అనుభవాలను అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని కూడా వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం వ్యాయాయం చేయాలని, యోగాను దైనందిన జీవితంలో ఓ భాగం చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంతులనం సాధ్యమవుతుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు తలెత్తుతున్నాయని, అయితే మన సంప్రదాయ ఆహారపద్ధతులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి తెలిపారు.

ఈ సందర్భంగా తన బాల్య స్మృతులను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. తనకు కబడ్డీ, ఖో-ఖో అంటే ఇష్టమని ఇప్పుడు నిత్యం బ్యాడ్మింటన్ ఆడుతున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అసెంబ్లీకి నిత్యం హాజరవుతూ ప్రతి సభ్యుడి ప్రసంగాన్ని వినేవారిమన్నారు. అనంతరం లైబ్రరీలో ప్రముఖుల ప్రసంగాలను చదివే విషయాన్నీ ఉపరాష్ట్రపతి తెలుగు విద్యార్థులతో పంచుకున్నారు.
అనవసర ఖర్చులు చేయకుండా పొదుపుగా ఉండాల్సిన అవసరాన్నీ ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్నారు. పెద్దల పట్ల గౌరవభావాలను ప్రదర్శిస్తూ వారి అనుభవాల ద్వారా నేర్చుకునే సారాన్ని తమ జీవితానికి వర్తింపజేసుకోవాలని వెంకయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అక్షత్ దహియాతో పాటు పలువురు తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement