Monday, April 29, 2024

గ‌ల్లీ టూ ఢిల్లీ తరలుతున్న నేతలు.. మహా ధర్నాకు మ‌స్త్ ఏర్పాట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోలు పంచాయతీ తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. కేంద్రం ఎప్పటిలాగే పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందేననే డిమాండ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దేశ రాజధాని ఢిల్లి నడి వీధుల్లో నినదించనున్నది. కేంద్రంపై సమరశంఖం పూరించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మహా ధర్నాతో మరింత ఉధృతిని పెంచనున్నది. ఈ అంశంలో కేంద్ర నిర్లక్ష వైఖరిపై తెలంగాణ భవన్‌ వేదికగా జరిగే మహాధర్నాలో రైతుల ఆత్మగౌరవ సింహగర్జనను యావత్‌ లోకానికి వినిపించేలా తెలంగాణ సర్కార్‌ సిద్దమైంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని రైతుల జీవన్మరణ సమస్యగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ముందుగానే పిలుపునిచ్చినట్లుగా సోమవారం ఢిల్లీలో యాసంగి ధాన్యం దంగల్‌కు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సిద్ధమైంది. అన్ని అస్త్ర శస్త్రాలతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల నిరసనతో రుచి చూపేలా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఈ మహా ధర్నాకు పార్టీ, ప్రభుత్వ శ్రేణులు సిద్ధమయ్యాయి. రైతుల దయనీయ పరిస్థితిని ఈ మహా ధర్నాలో తెలంగాణ నేతలు ఢిల్లిలో కళ్లకుకట్టేలా ప్రస్తావంచి కేంద్రం కళ్లు తెరిపించాలనే లక్ష్యంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతాంగ సమస్య కాదు…ఆత్మగౌరవ సమస్య…

ఢిల్లిలో పోరుతో తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని జాతీయ స్థాయిలో చర్చకు దారితీసేలా సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలను ఢిల్లిలోనుంచే రచిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ నేతలకు దిశానిర్ధేశం చేశారు. మహా ధర్నా వ్యూహం ఖరారు చేసి, ఏర్పాట్లకు ఎంపీలకు కీలక బాధ్యతలను అప్పగించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఆవశ్యకతను, రైతాంగం పడుతున్న బాధలను జాతీయ స్థాయిలో వినిపించేందుకు ఈ మహా ధర్నాను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేదికగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లాలని భావిస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ ప్రజలను అవమానించేలా హేళనతో మాట్లాడిన మాటలను కూడా తీవ్ర స్థాయిలో తమ నిరసనల ద్వారా వివరించడంతోపాటు, పంజాబ్‌లో కొనుగోలు చేస్తున్నట్లుగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించాలనే డిమాండ్‌ను ఢిల్లిలో గట్టిగా వినిపించనున్నారు. ఇందుకు భారీగా ప్రత్యేక విమానాల్లో పార్టీ నేతలను, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిదులను తరలించనుంది. ఇప్పటికే కొందరు ఢిల్లికి చేరుకోగా ఆదివారం మరికొందరు ప్రత్యేక విమానాలు, ఇతర మార్గాల్లో ఢిల్లి బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌ సమీపంలో భారీ ఏర్పాట్లను తెలంగాణ సర్కార్‌ చేస్తున్నది. ఇందుకు పలువురు మంత్రులు, ఎంపీలకు బాధ్యతలను అప్పగించింది. ఢిల్లిలో బసకు హోటళ్లను, ప్రయాణానికి విమాన టిక్కెట్లను కూడా బుక్‌ చేసి ఢిల్లి వేదికగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేశారు.

భారీ ఎత్తున మహా ధర్నా…..

తెలంగాణ భవన్‌ సమీపంలోని ఖాళీ స్థలంలో భారీ స్టేజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొత్తం ప్రాంతాన్ని కవర్‌ చేసేలా టెంట్లను వేయనున్నారు. ప్రతీ నియోజకవర్గంనుంచి జనాన్ని తరలించేందుకు వీలుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రకరకాల మార్గాల్లో ఢిల్లికి జనాన్ని తరలించారు. ఈ మహా ధర్నాలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబి, డీసిఎంఎస్‌ చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర,జిల్లా కమిటీలు విధిగా పాల్గొనేలా కార్యాచరణ ఖరారు చేసినసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరంతా ఢిల్లికి చేరుకుంటున్నారు.

- Advertisement -

విజయవంతమైన పోరు…

ఇప్పటికే ఐదంచెల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో రైతులు, పార్టీ శ్రేణులు విస్తృతంగా సీఎం కేసీఆర్‌ పిలుపుకు స్పందించి కేంద్రంపై నిరసన పోరును విజయవంతం చేశాయి. యాసంగిలో తెలంగాణలో పడిన ప్రతీ ధాన్యం గింజను కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలు పూర్తిగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఢిల్లిdలో నిర్వహింనున్న మహా ధర్నాపై దృష్టి కేంద్రీకరించాయి. నల్ల జెండాలు, నిరసనలు, ఊరూరా ర్యాలీలు, ప్రదర్శనలు, కేంద్ర ప్రభుత్వ తీరుపై వరుస కార్యాచరణతో హోరెత్తించారు. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్న తీరుపై ఇక ఢిల్లీ వేదిక ద్వారా యావత్‌ దేశానికి టీఆర్‌ఎస్‌ ఈ మహా ధర్నా ద్వారా చాటిచెప్పనున్నది. కేంద్రం దిగొచ్చే వరకు వెనుకకు తగ్గేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను ఈ మహా ధర్నా ద్వారా పునరుద్ఘాటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకొని మహా ధర్నా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కేంద్ర కక్షపూరిత ధోరణిని మహా ధర్నాలో ఎండగట్టేలా పలువురు నేతలు ప్రసంగించనున్నారు. రోజంతా కొనసాగనున్న మహాధర్నాలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే అంశంపై ఇంకా ఎటువంటి స్పష్టత రానప్పటికీ, చివరి నిమిషంలో ఆయన ఈ ధర్నాలో పాల్గొంటారనే కొన్ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఢిల్లిdలో కీలక రైతు సంఘాలు, నాన్‌ బీజేపి నేతలు పలువురు కూడా ఈ మహా ధర్నాలో పాల్గొని కేంద్ర నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టనున్నారు.

కోతలు షురూ…పెరిగిన ధాన్యం ఉత్పత్తి…

కాగా రాష్ట్రంలో రైతాంగానికి, తెలంగాణ సర్కార్‌కు సరికొత్త సవాలు ఈ నెలలో పెరిగింది. కేంద్ర తాత్సారంతో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో భారీగా ధాన్యం వెల్లువెత్తే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. తాజా సీజన్‌లో తెలంగాణ నుంచి 78.85లక్షల టన్నుల దిగుబడి కానున్నదని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని తేల్చి చెప్పడంతో, రైస్‌ మిల్లర్లు ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయరని రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రత్యామ్నాయ పంటలే వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయినప్పటికీ రైతాంగం 35.84లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. మొత్తం తెలంగాణనుంచి వచ్చే ధాన్యంలో 20లక్షల టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసినా , ఇతర అవసరాలకు మరో 15లక్షల టన్నులు పోయినా కనీసంగా 40లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ముడి బాయ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం పంతానికి పోవడంతో తెలంగాణ రైతాంగం దిక్కుతోని పరిస్థితిలో పడిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement