Sunday, April 28, 2024

Justice | మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ నేత.. మహిళా మోర్చా లీడర్​కి జడ్జిగా చాన్స్​!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తమ ప్రతినిధులు పెట్టాలనే ఆలోచనలకు తగ్గట్టు చర్యలు తీసుకుంటోంది. అయితే.. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ పలుమార్లు చెబుతూ వస్తున్నారు. కానీ, ఇవ్వాల బీజేపీ తాను అనుకున్నది సాధించింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ మహిళా మోర్చా లీడర్​ని నియమిస్తూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం ఆగమేఘాలమీద ఆమోదం తెలిపింది. దీన్ని చాలామంది న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బీజేపీ మహిళా మోర్చా నేత​, న్యాయవాది అయిన ఎల్‌సీ విక్టోరియా గౌరీని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, రాజు రామచంద్రన్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీని నియమించడన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సోమవారం ఈ అంశాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించారు.

న్యాయవాది రామచంద్రన్ అత్యవసర విచారణను కోరినప్పుడు ఈ విషయం మొదట ఉదయం ప్రస్తావనకు వచ్చింది. అయితే.. ఈ అంశంపై శుక్రవారం విచారించేందుకు సీజేఐ అంగీకరించారు. ఇదిలా ఉండగానే.. వెంటనే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీ నియామకాన్ని సిఫార్సు చేస్తూ పంపిన ఫైల్‌ను క్లియర్ చేయాలని కేంద్రం నుంచి నోటిఫికేషన్ వచ్చింది.

దీంతో మధ్యాహ్నం 1:20 గంటలకు న్యాయవాదులు మళ్లీ CJIని సంప్రదించారు. అత్యవసర అభ్యర్థన ఉందని, కోర్టు యొక్క “అసాధారణ మన్నన”  (extraordinary indulgence ) కోరుతూ వారు అభ్యర్థించారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రావాలని న్యాయవాదులను సీజేఐ కోరారు. కోర్టు మళ్లీ సమావేశమైనప్పుడు CJI మాట్లాడుతూ “కొలీజియం సిఫార్సు చేసిన తర్వాత తమ దృష్టికి వచ్చిన పరిణామాలను పరిగణలోకి తీసుకుంటామని, రేపు కోర్టు ఈ కేసును విచారిస్తుంది” అని చెప్పారు.

- Advertisement -

మద్రాసు హైకోర్టులో న్యాయవాది ఎల్‌సీ విక్టోరియా గౌరీని న్యాయమూర్తిగా నియమించడాన్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. అంతకుముందు, మద్రాస్ హైకోర్టు నుండి 21 మంది న్యాయవాదుల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ బీజేపీ కార్యకర్త అయిన అడ్వకేట్ గౌరీని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేస్తూ కొలీజియం సమర్పించిన ఫైల్‌ను తిరిగి పంపాలని కోరారు. కాగా, గౌరీ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని వారు రాష్ట్రపతికి వివరించారు.

అంతేకాకుండా విక్టోరియా గౌరీ మైనారిటీ వర్గాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలను ఈ సందర్భంగా న్యాయవాదులు ఉదహరించారు. ఆమెలో లోతుగా పాతుకుపోయిన మత దురభిమానాన్ని గతంలో చేసిన వ్యాఖ్యలే ప్రతిబింబిస్తాయని, తద్వారా ఆమెను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అనర్హులుగా చేయాలని న్యాయవాదులు కోరారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి సపోర్ట్..​

అయితే.. ఈ చర్చ అంతా కొనసాగుతుండగానే రాజకీయ అనుబంధం ఉన్న న్యాయవాదులు న్యాయమూర్తులు కావచ్చనే అభిప్రాయానికి న్యాయ మంత్రి కిరణ్ రిజిజు సపోర్టు చేశారు. గతంలో కూడా రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులను హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారని సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన పోస్ట్ ను రిజిజు రీట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement