Saturday, April 27, 2024

Delhi: కేసీఆర్ పాలనకు అంతిమ ఘడియలు.. మునుగోడు సభ ముహూర్తం ఖరారు: తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, అమిత్ షా ఈ సభకు హాజరవుతున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా పర్యటన వివరాలు వెల్లడించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు సభలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు.

అలాగే గురువారం సాయంత్రం గం. 4.00కు కోరుట్లలోనూ ఓ సభను ఏర్పాటు చేశామని, పలువురు ప్రముఖ నాయకులు ఈ సభా వేదికపై పార్టీ కండువా కప్పుకుంటారని వెల్లడించారు. కోరుట్ల సభకు తాను హాజరవుతానని, మునుగోడు సభకు అమిత్ షా సహా పలువురు జాతీయస్థాయి నాయకులు హాజరవుతారని వెల్లడించారు. త్వరలో జరగనున్న ఉప-ఎన్నికల నేపథ్యంలో ఈ సభ బీజేపీకి అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ఆయనకు విశ్వాసం లేదని, తనను తాను రాజుగా భావిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాదిగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి బండి సంజయ్‌ను ఆయన కార్యాలయం నుంచి లాఠీచార్జి చేసి మరీ అరెస్టు చేశారని తరుణ్ చుగ్ గుర్తుచేశారు. మరోవైపు ధర్మపురి అరవింద్ తన నియోజకవర్గంలో తిరగకుండా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అధికారం చేజారిపోతుందన్న ఆందోళన, గాభరా సీఎం కేసీఆర్‌లో కనిపిస్తున్నాయని, అందుకే ప్రజా సంగ్రామ యాత్రపై వరుసగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జనగామలో జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వ్యాఖ్యానించారు.

మొదటి శత్రువు ప్రధాని మోదీ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తరుణ్ చుగ్ స్పందించారు. ఆయన సాయంత్రం పూట మాట్లాడే మాటలకు తాను బదులివ్వనని, సాయంత్రమైతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రతి రహదారిలో కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement