Wednesday, April 24, 2024

ప్రమాదంలో జవాన్ రాజ‌శేఖ‌ర్‌ మృతి.. విషాదంలో కుటుంబం, పార్ధివదేహం కోసం ఎదురుచూపు

సంబేపల్లి (ప్రభ న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని (పూర్వపు కడప జిల్లా) అన్న‌మ‌య్య జిల్లాలో విషాదం నెల‌కొంది. దేవపట్ల గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన జవాన్ దెవరింటి రాజశేఖర్ (34) అమర్‌నాథ్ యాత్రలో డ్యూటీ చేసి తిరుగు ప్రయాణంలో చ‌నిపోయాడు. జమ్మూ కాశ్మీర్‌కు వ‌స్తుండ‌గా బస్సు లోయలో పడడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో రాజశేఖర్ కూడా ఉన్నారు. 12 ఏళ్లుగా (ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్) గా రాజ‌శేఖ‌ర్ విధులు నివర్తిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ చ‌నిపోవ‌డంతో వారి ఇంట విషాదం నెల‌కొంది. అత‌నికి 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య ప్రమీల, పెద్ద కుమార్తె (11), కుమారుడు మోక్షిత్ ( 8) ఏడాది చిన్న కుమార్తె హిమశ్రీ ఉన్నారు.

మూడు నెలల క్రితం జ‌వాన్‌ రాజ‌శేఖ‌ర్ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పాడని, మధ్యాహ్నం ఒకటిన్నరకు బస్సు ప్రమాదంలో చ‌నిపోయిన‌ట్టు అధికారులు చెప్పడంతో ఒకసారిగా షాక్‌కి గుర‌య్యామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న ఆ కుటుంబానికి ఉన్న ఆధారం కోల్పోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. మృతుడి తల్లి రాములమ్మ, తండ్రి చెన్నయ్య, తమ్ముడు సురేష్ ఉన్నారు. త‌మ్ముడు డిగ్రీ వరకు చదువుకుని ఇంటి వద్ద ఉంటున్నాడు. బ‌తుకుతెరువు కోసం ఉద్యోగం రాక కువైట్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇక‌.. అమ‌ర జ‌వాన్ రాజ‌శేఖ‌ర్‌ చెల్లెలు లావణ్య వివాహం అయినట్లు బంధువులు తెలిపారు. ఉమ్మడి కుటుంబం ఉన్న వీరికి ఎంతో కొండంత అండగా ఉన్న రాజశేఖర్ ఒకసారిగా లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం రానున్నట్లు తెలుస్తోంది. అధికారిక లాంఛ‌నాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement