Tuesday, April 30, 2024

ఫోకల్‌ పోస్టుల కోసం పైరవీలు, ఉద్యోగ బదిలీలకు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: మూడేళ్ల తర్వాత ప్రభుత్వం సాధారణ బదిలీలకు తెరలేపడంతో ‘ఫోకల్‌’ పోస్టుల కోసం ఉద్యోగులు, అధికారుల పైరవీలు విస్తృతమయ్యాయి. బదిలీలకు మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో కోరుకున్న పోస్టు దక్కించుకునేందుకు కొందరు..ఉన్న సీటును పదిలం చేసుకునేందుకు మరికొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం పైస్థాయి అధికారులు, గాడ్‌ఫాదర్ల చుట్టూ వారు ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇతర శాఖలతో పోల్చితే రెవిన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, రవాణా, ఎక్సైజు తదితర రాబడి వచ్చే శాఖల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు సైతం తన పరిధిలో సొంత మనుషులను పెట్టుకోవడంపై దృష్టిసారించారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉంది. అత్యవసర శాఖల్లో మినహా మిగిలిన శాఖల్లో బదిలీలు లేవు. మంచి సీటు కోసం పలువురు అధికారులు, ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తేసింది. ఇదే అదనుగా పలువురు అధికారులు, ఉద్యోగులు ‘రాబడి’ సీట్ల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉండటంతో అధికారులు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్దకు తెలిసిన వ్యక్తులను పట్టుకొని వెళుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టింగ్‌లు ప్రజా ప్రతినిధుల అంగీకారంతోనే జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పని చేయాలంటే సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి. ఆ ఎమ్మెల్యే నుంచి అనుమతి లేఖలు తీసుకునేందుకు చోటామోటా నేతల ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఆయా ప్రజా ప్రతినిధుల బంధువుల ద్వారా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారులైతే తెలిసిన ప్రతి ప్రజా ప్రతినిధి నుంచి లేఖలు తీసుకొని పోస్టింగ్‌ కోరుకుంటున్న ప్రాంతంలోని ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. కీలక స్థానాల కోసం పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తున్న నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా తమకు అనుకూలమైన వ్యక్తులైతేనే సిఫారసు లేఖలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి సంఘాల నేతలు..

తమ వారి కోసం ఉద్యోగ సంఘాల నేతలు కూడా రంగంలోకి దిగారు. మూడేళ్ల తర్వాత బదిలీలు జరుగుతుండటంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తడి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోరుకున్న సీటు దక్కించుకునే వారే కాక ఉన్న పోస్టును పదిలం చేసుకోవాలనుకుంటున్న వారు కూడా ఉద్యోగ సంఘాల నేతలను కలుస్తున్నారు. సంఘాల్లో తాము నిర్వహిస్తున్న పాత్రను పేర్కొంటూ, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు తమకు ఉపయోగపడతారంటూ ఆయా సంఘాల నేతలను వీరు అడుగుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని ఆయా సంఘాల నేతలు కూడా ఉన్నతాధికారులతో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు సంఘాల నేతలు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కలుస్తూ తమ జాబితా అంటూ అందజేస్తున్నారు. మరో వైపు అధికారులపై కూడా ఇదే తరహాలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు చెపుతున్నారు. ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కరి ప్రాతినిధ్యం, ప్రభావం ఉంటుంది. గతంలో తమకు తగిన ప్రాతినిథ్యం దక్కలేదని భావిస్తున్న అధికారులు, ఉద్యోగులు ఎప్పటి నుంచో బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం వీరిలో ఆశలు రేకెత్తించింది. ఈసారి తమకు మంచి పోస్టు దక్కుతుందని ఆశించిన వీరంతా పెద్ద ఎత్తున పైరవీలు, సిఫారసులు వస్తుండటంతో ఆందోళనకు లోనవుతున్నారు. అవే ప్రభావం చూపితే తమ పరిస్థితి ఏంటంటూ వీరు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం బదిలీల ప్రహసనాన్ని ఏ విధంగా ముగిస్తుందనేది కొద్ద రోజుల్లోనే తేలనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement