Wednesday, May 8, 2024

బ‌య్యారంపై కేంద్రం కుట్ర – అదానికి అండ‌గా మోడీ తంత్రం..కెటిఆర్

హైద‌రాబాద్ – నష్టాలను జాతికి , లాభాలను దోస్తులకు అంకితం చేయటంలో ప్ర‌ధాని మోడీ దిట్ట అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం విక్రయిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బీహెచ్ఇఎల్ కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. బీమా పథకాలన్నీ ఎల్ఐసీ కి అప్పగించారని, నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చినవారికి అప్పగించడం.. కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇక బ‌య్యారం స్టీల్ ప్లాంట్ నిర్మించ‌కుండా ఎపిలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేందుకు ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన విమ‌ర్శ‌ల‌పై కెటిఆర్ స్పందిస్తూ, . బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదు.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు” అని దుయ్యబట్టారు.

సెయిల్ ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి అన్నారు. బయ్యారం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. బైల‌దిల్లాకు కేవ‌లం 160 కిలో మీట‌ర్ల బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎన్నోసార్లు కలిశానని, బైలాదిల్లా నుంచి బయ్యారానికి 50 శాతం పైప్‌లైన్ ఖర్చు భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి లాభం లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ద‌గ్గ‌ర‌లో ఉన్న గ‌నులు కేటాయించ‌కుండా ఇటు బ‌య్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర‌మే కుట్ర చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.. ప్ర‌ధాని మోడీ బైల‌దిల్లా గ‌నుల‌ను అదానికి క‌ట్టిపెడుతున్న కుట్ర‌ను కుట్రను గుర్తించలేకపోయామని అన్నారు. బ‌య్యారంకు కేటాయించ‌వ‌ల‌సిన ఉక్కు గ‌నుల‌ను కొట్టేసేందుకు 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ బైలదిల్లా ఐరన్‌ ఓర్ కంపెనీ పెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను గుజరాత్‌లోని ముంద్రా కు తరలించేలా ప్రణాళిక చేశారని మంత్రి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని, అదానీ కోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. బైలదిల్లా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడిందని, నష్టాలను చూపించి దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోడీ విధానమని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు, నిధులు. ఇవ్వకపోవడంతోనే నష్టాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి అమ్మడానికి చూస్తున్నారు” అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలపై మోడీ చేస్తున్న కుట్రను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement