Tuesday, April 30, 2024

Delhi | కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ.. పలు అంశాలపై సహకారానికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కి నిధులు, కేటాయింపులు ఇచ్చినట్టు తెలంగాణకు ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ని ప్రతిపాదనలు పంపినా, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించినా… ఏదో ఒక కొర్రీ పెడుతూ ఏదీ మంజూరు చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురి, పీయూష్ గోయల్, అమిత్ షాతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మొదట కేటీఆర్ ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిశారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పెట్రోలియం సహజ వాయు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ఆయన కోరారు.

లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలంటూ మరో ప్రతిపాదన సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్ , లింకు రోడ్ల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు 2,400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

హైదరాబాద్ నగరంలో భారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, చెత్తను శుద్ధి చేయడంతో పాటు తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రొక్యుర్‌మెంట్ కోసం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద 400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. 3050 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 15% నిధులను కేంద్రం అందించాలని ఇందుకోసం 450 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు 3722 కోట్ల రూపాయలని, ఇందులో కనీసం 20 శాతం 744 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని, వాటన్నిటి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా 3777 కోట్ల రూపాయల ఖర్చవుతుందని ఇందులో 750 కోట్ల రూపాయలను కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపై హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్ వలన పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్రమంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు.

అనంతరం ఆయన కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల అదనపు బాయిల్డ్‌ రైస్‌ను‌ లక్ష్యంగా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్‌లో పండిన వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలు మిల్లింగ్‌కు అనుకూలం కానందున ముడి బియ్యాన్ని డెలివరీ చేయడానికి అనుకూలంగా లేదని ఆయన తెలిపారు. ఆ తర్వాత రాత్రి 10.15 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేటీఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రభ టెలిగ్రామ్ చానెల్ లింక్ https://t.me/prabhaanews క్లిక్ టు జాయిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement