Friday, April 26, 2024

కొండగట్టు అంజన్న ఆలయాభివృద్ధికి కృషి చేస్తాన‌న్న‌ ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నుండి కొండగట్టు చేరుకున్న కవిత అక్క‌డి నుండి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ముందుగా భేతాళ స్వామి, సుబ్రమణ్యస్వామికి పూజలు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన కవిత ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టులో నిర్మిస్తున్న రామకోటి స్థూప పనులను పరిశీలించారు.

ఆలయం మొత్తం పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ…. కొండగట్టు దేవాలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. ఏ కొండెక్కినా, ఏ బండ‌కు మొక్కినా అది రాష్ట్రం కోస‌మేన‌ని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ నిధులు మంజూరు చేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత కొండగట్టు ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రాసే రామకోటిలను స్వామి వారికి సమర్పించేందుకు వీలుగా రామకోటి స్థూపాన్నినిర్మిస్తున్నామని, నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రజలందరికీ కరోనా కష్టాలు తొలగిపోవాలని గత ఏడాది చిన్న హనుమాన్ జయంతి నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు 81 రోజులు పరిపూర్ణంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు పెద్ద ఎత్తున యాగం నిర్వహించామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా రెండోసారి ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు, అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. రామకోటి స్థూప నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం, ఎమ్మెల్సీ కవిత భక్తులు, ఆలయ సిబ్బందిని పలకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement