Tuesday, April 30, 2024

వేడిత‌గ్గ‌ని కోనసీమ, నిలిచిపోయిన ఇంటర్నెట్‌ సేవలు.. వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగుల ఇక్కట్లు

అమలాపురం, ప్రభన్యూస్‌ : కోనసీమ జిల్లాలో గత ఐదు రోజులుగా ఇంటర్‌నెట్‌ సేవలు నిల్చిపోయాయి. దీంతో యువత వెర్రెక్కిపోతున్నారు. అలాగె, ఇంటినుంచి విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సాధారణ ఫోన్‌కాల్స్‌ తప్ప మరే విధమైన నెట్‌ సేవలు అందుబాటులో లేవు. వాట్సప్‌లు, టెలీగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, యు ట్యూబ్‌లేవీ పని చేయడంలేదు. ఇక ఒటిటిలన్నీ మూగబోయాయి. ఓ వైపు విధ్వంసానికి సంబంధించిన విచారణ చురుగ్గా సాగుతోంది. శనివారం వరకు 71మందిని అదుపులోకి తీసుకోగా తాజాగా ఆదివారం మరో 18మందిని అరెస్టు చూపించారు. వీరిలో 62మందిని రిమాండ్‌కు కూడా పంపించారు. అయినా ఇంటర్‌నెట్‌ పునరుద్దరణ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి యువకులు అటు సఖినేటిపల్లి.. ఇటు కోటిపల్లి, మరో వైపు జొన్నాడ లకు వేలాది సంఖ్యలో పోటెత్తారు. గోదావరి తీరంలో పక్క జిల్లాకు చెందిన నెట్‌ సిగ్నల్స్‌ అందుతుండడంతో ఒక్కసారిగా పాత మెసెజ్‌లన్నీ వందల సంఖ్యలో వచ్చిపడుతున్నాయి. అలాగే వీరు పంపాలనుకున్న మెసెజ్‌లను కూడాపెద్దసంఖ్యలోనే పార్వర్డ్‌ చేసుకున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు గత ఐదురోజులుగా ఈమెయిల్స్‌ చూసేందుకు వీల్లేకుండా పోయింది. వాటిలో ముఖ్యమైనవి ఉన్నాయన్న ఆందోళన వారికింత వరకు నిద్రపట్టనివ్వడంలేదు. గోదావరి తీరంలో సిగ్నల్స్‌ అందుబాటులో ఉండడంతో వెంటవెంటనే మెయిల్స్‌ పరిశీలించుకున్నారు.

ఇదిలా ఉంటే ఆదివారం కోనసీమలో పోలీస్‌ పహరా మరింత పెంచారు. ఇందుక్కారణం ఓ వర్గానికి చెందిన దుండగులు ప్రతిదాడి చేసే అవకాశముందంటూ సమాచారం అందడమే. అలాగే ఓ కీలకనాయకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు కూడా పోటెత్తాయి. అయితే ఇవేవీ దృవీకరణ కాలేదు. కాగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా సెక్షన్‌ 30, 144అమల్లో ఉన్నాయి. ఎటువంటి ర్యాలీలకు, సమావేశాలకు అనుమతిలేదు. అయినా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరుకు మద్దతు పలుకుతూ వచ్చేనెల 2వ తేదీన ఛలో అమలాపురం కార్యక్రమానికి కొన్ని వ ర్గాలు పిలుపునిచ్చాయి. దీన్ని పోలీస్‌ యంత్రాంగం సీరియస్‌గా పరిగణించింది. ప్రత్యేక సెక్షన్లు అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి పిలుపునివ్వడాన్ని కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తామని డిఐజి పాలరాజు హెచ్చరించారు. ఇదిలా ఉంటే విధ్వంసానికి సంబంధించి ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీ రింకా నిందితుల్ని గుర్తిస్తున్నారు. ఇందుకోసం సిసి ఫుటేజ్‌లు, ప్రెస్‌క్లిపింగ్‌లు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లను ఆధారంగా తీసుకుంటున్నారు. అలాగే వదంతుల్ని ప్రచారం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement