Friday, May 10, 2024

కేసీఆర్‌ సర్కారు కీలక నిర్ణయం.. సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : సింగరేణి కార్మికుల కుటుంబాలకు తెలంగాణాలోని కేసీఆర్‌ సర్కారు శుభవార్త తెలిపింది. రామగుండం మెడికల్‌ కాలేజీలో ఆడ్మిషన్లలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సౌజన్యంతో రామగుండంలో మెడికల్‌ కాలేజీని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో నిర్మితమవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్‌ అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సింగరేణి మెడికల్‌ కాలేజీగా పేరు పెట్టాలని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. తాజాగా సింగరేణి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

- Advertisement -

రామగుండం మెడికల్‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌ కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్‌ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 23 సీట్లు ఆల్‌ ఇండియా కోటాకి కేటాయిస్తారు. మిగతా 127 ఎంబీబీఎస్‌ సీట్లలో 5శాతం వీరికి రిజర్వేషన్‌ కింద కేటాయించింది ప్రభుత్వం. అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు దక్కనున్నాయి. నీట్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌, ఈమేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement