Sunday, May 26, 2024

భయంలో కేసీఆర్.. మహారాష్ట్ర పరిణామాల తర్వాత నిద్ర పడుతుందో లేదో : తమ్మినేని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు భయంలో ఉన్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఢిల్లీలోని హరికిషన్ సూర్జిత్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వేడి ఎక్కువగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని, దీంతో రాజకీయ పార్టీలు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా రాజకీయాల మీదనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ 8 ఏళ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గట్టెక్కించే పరిస్థితి లేదని అన్నారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావాన్ని తగ్గించడంలో మాత్రం కేసీఆర్ విజయం సాధించారని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ కేసీఆర్ మంచిపని చేస్తున్నారని, అయితే బీజేపీని వ్యతిరేకించినంత మాత్రాన ఆ కారణంతో తాము టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో చాలా మంది షిండేలు ఉన్నారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంతో కేసీఆర్ భయంలో ఉన్నారని వీరభద్రం అన్నారు.

బీజేపీని చూస్తుంటే.. నేరస్తులే జడ్జి స్థానంలో ఉన్నట్టుంది: వి. శ్రీనివాస రావు, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి
భారతీయ జనతా పార్టీని చూస్తుంటే నేరస్తులే జడ్జి స్థానంలో ఉన్నట్టుగా ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి. శ్రీనివాస రావు అన్నారు. ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదని అన్నారు. పార్లమెంటులో వైఎస్సార్సీపీ ప్రజా సమస్యలపై గొంతెత్తడం లేదని అన్నారు. రాజధానికి నిధులివ్వకుండా తాము అధికారంలోకి వస్తే రాజధాని నిర్మిస్తారని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ విషయంపై సోము వీర్రాజును రైతులు నిలదీస్తే పారిపోయారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. పైపెచ్చు పన్నుల భారం పెంచి రాష్ట్ర ప్రజలను పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. వైద్య రంగంలో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు లు చేస్తున్నారని, దేశంలో పరిస్థితులపై ప్రతిపక్ష పార్టీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాడాలని కోరారు. భద్రాచలం గ్రామాలు తెలంగాణలో కలపానడంలో రాజకీయ పార్టీల నిర్ణయం ఉండదని, ప్రజాభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీలో బిజెపికి వత్తాసు పలుకుతున్న రెండు పార్టీలకు తగిన శాస్తి జరుగుతుందని శ్రీనివాస రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement