Thursday, May 2, 2024

కమీషనేశ్వరంగా మారిన కాళేశ్వరం, కేసీఆర్‌ను గద్దె దించేది బీజేపీయే : దాసోజు శ్రవణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాజకీయ అధికార మార్పిడి జరగాల్సిన అవసరముందని, కేసీఆర్‌ను  గద్దె దించేది బీజేపీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ జోస్యం చెప్పారు. న్యూఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  మురళీధర్‌రావు, బీజేపీ పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ సమక్షంలో శనివారం ఆయన బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా, తరుణ్ చుగ్ పార్టీ సభత్వం ఇచ్చారు. శ్రవణ్‌తో పాటు పలువురు ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరారు.

అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. 35 వేల కోట్ల రుపాయిలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యవయాన్ని లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్ళి కాళేశ్వరాన్ని కేసీఆర్ కమీషనేశ్వరంగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల పాలిత శాపంగా మారారని విమర్శించారు. 40 లక్షల మంది చదువుకున్న యువత బిచ్చగాళ్ళుగా మారిపోయిన దారుణమైన పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా, వైద్య వ్యవస్థలను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి ఏ స్థాయిలో వుందంటే తెల్ల రేషన్ కార్డ్ వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు అక్రమ సొమ్ముతో కార్లు, బంగ్లాలు, ప్యాలెసులతో అవినీతి బకాసురులుగా మారిపోయారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెబుతూనే ప్రతి పల్లెలో బెల్టు షాపులు పెట్టి పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు.

అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన మేధావి వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌ని కూడా కేసీఆర్ పక్కన పెట్టారని అన్నారు. గొప్ప వ్యక్తిత్వం, కష్టపడే గుణం, విషయ పరిజ్ఞానం వున్న శ్రవణ్ వంటి నాయకులు రావడంతో బీజేపీకి మరింత పటిష్టమవుతుందని చెప్పారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement