Thursday, May 16, 2024

Followup: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బాధ్యతల స్వీకరణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఆయనను హైకోర్టు సీజేగా నియమిస్తూ గత ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసి, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గెజిట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా ఉన్న సతీష్‌చంద్రను బదలీ చేసిన కేంద్రం ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పదోన్నతిని ఇవ్వాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు హైకోర్టులో సీనియార్టీలో రెండోస్థానంలో ఉన్న జస్టిస్‌ భూయాన్‌కు సీజేగా పదోన్నతి దక్కింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం బదలీ చేయగా, ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా నియమితులయ్యారు.

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అస్సాం రాజధాని గౌహతిలో 1964 ఆగష్టు 2న జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ అసోం మాజీ అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రాథమిక విద్యను గౌహతిలోని డాన్‌బాస్కో పాఠశాలలో పూర్తిచేశారు. గౌహతిలోని ప్రభుత్వ లా కాలేజీనుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ఆయన అక్కడి హైకోర్టులో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గౌహతి హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. హౌకోర్టు పరిధిలోని అగర్తల, షిల్లాంగ్‌, కొహిమా, ఈటానగర్‌ తదితర బెంచిలలో ఆయన తన వాదనలను వినించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదాయపు పన్ను స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కూడా ఆయన సేవలందించారు. 2002 ఏప్రిల్‌నుంచి 2006 అక్టోబర్‌ వరకు మేఘాలయలో ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌గా, 2005నుంచి 2009 వరకు అరుణాచల్‌ ప్రదేశ్‌ అటవీ శాఖ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. 2010 మార్చి 3న గౌహతి హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌ నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్‌ 6న సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా, 2011 జూలై 21న అస్సాం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు. 2011లోనే గౌహతి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2019లో ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పనిచేశారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జీగా ఉజ్జల్‌ భూయాన్‌ బదలీపై వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా సేవలందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement