Thursday, May 16, 2024

ఢిల్లీ పర్యటనలో జగన్.. పోలవరం, విభజన సమస్యలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రేపు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.30కు ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, బకాయి నిధులు, విభజన చట్టంలో పొందుపర్చిన హామీల గురించి చర్చించనున్నట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను తిరిగి చెల్లించే విషయంలో జరుగుతున్న జాప్యంపై చర్చించనున్నట్టు తెలిసింది. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మాట్లాడారు. సవరించిన అంచనాలు, నిర్మాణ ధరల గురించి గట్టిగా నిలదీశారు.

పదేళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు నిర్మాణం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. దీంతో పాటు విభజన చట్టంలో పొందుపర్చిన అనేక హామీల అమలు కోసం విధించిన పదేళ్ల గడువు కూడా పూర్తికావొస్తోందని, ఇప్పటికీ చాలా హామీలు పూర్తికాకపోగా, కొన్ని హామీలను అసలు అమలుచేయడమే లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పొందుపర్చిన సంస్థల విభజన కూడా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆయా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయం అందడంలేదని చెబుతోంది. ఈ విషయంపై కూడా ప్రధానితో జరిగే చర్చలో సీఎం జగన్ ప్రస్తావించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు రుణపరిమితి, పన్నుల్లో వాటా నిధులు తదితర ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు రాజకీయంగానూ జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement