Monday, May 20, 2024

నల్లసముద్రంలో డాల్ఫిన్ల మృత్యువాత.. కొట్టుకొస్తున్న కళేబరాలు, యుద్ధనౌకల దుష్ఫలితాలే కారణమా?

కీవ్‌:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సముద్రజీవుల ప్రాణాలమీదకొస్తోంది. ప్రత్యేకించి నల్లసముద్రంలో డాల్ఫిన్ల ప్రాణాలు తీస్తోంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఆ తరువాత నల్లసముద్ర జలాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఇతర సైనిక వ్యవస్థల కదలికలు ఎక్కువయ్యాయి. వీటివల్ల సోనార్‌ సాంకేతికత వినియోగం పెరిగింది. అట్టడుగు జలాల్లో ప్రతిధనుల ద్వారా ఇతర వస్తువులు, జీవులు, ఆయుధాలు, జలాంతర్గాముల కదలికలను పసిగట్టవచ్చు. ఆ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. అయితే ఈ పరిణామం సముద్రజీవులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రత్యేకించి సోనార్‌ విధానంతోనే డాల్ఫిన్లు కూడా ఆహారాన్ని, శత్రువులను గుర్తించి సంచరిస్తాయి. అయితే సైనిక వాహనాల సాంకేతికతవల్ల ఇవి గాయపడుతున్నాయి. వీటి శరీరంపై కాలిన గాయాలు కన్పిస్తున్నాయి. ఫలితంగా రోజులతరబడి ఆహారాన్ని తీసుకోలేక మృత్యువాత పడుతున్నాయని జీవశాస్త్ర నిపుణులు గుర్తించారు. ఇటీవలి కాలంలో నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ పరిసరాల్లో వందల సంఖ్యలో డాల్ఫిన్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి.

వాటి శరీరంపై గాలిన గాయాలుండటం గమనార్హం. పైగా అవి జలాల్లో సంచరించలేని విధంగా బలహీనంగా మారిపోయాయని తేలింది. ఒడేశా తీరంలోకి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ల కళేబరాలను అక్కడి తుజ్‌లివ్‌స్కీ లిమనీ నేచర్‌ పార్క్‌ పరిశోధకుడు ఇవాన్‌ రుసోవ్‌ పరిశీలించారు. సైనిక వాహనాల సోనార్‌ వ్యవస్థలు, కదలికల ఫలితంగానే అవి మరణిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇటీవలి కాలంలో నౌకా నగరమైన ఒడేశాను సాధీనం చేసుకునేందుకు పెద్దఎత్తున రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన తరువాత బల్గేరియా, రుమేనియా, ఉక్రెయిన్‌ తీరాల్లో వందల సంఖ్యలో డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కాగా డాల్ఫిన్లను రక్షించండి.. యుద్ధాన్ని ఆపండంటూ బల్గేరియా ప్రముఖుడు అతన్నాస్‌ రుసేవ్‌ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement