Tuesday, May 7, 2024

కాయ్‌ రాజా కాయ్‌.. బంతి బంతికి బెట్టింగ్‌..

నంద్యాల, ప్రభన్యూస్ : క్రికెట్‌ సంబరం ఐపీఎల్‌ మొదలు కావడంతో క్రికెట్‌ ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, వీరితో పాటు క్రికెట్ బుకీలు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. ఐపీఎల్‌ సీజన్‌15 మార్చి 26 నుండి మొదలయ్యి మే29కి 64 రోజుల పాటు కొనసాగనుంది. దీంతో క్రికెట్‌ అభిమానులకు మండుటెండలలో హిమాపాతంలా మ్యాచ్‌ జరిగే రోజున పండుగ చేసుకుంటున్నారు. వీరి క్రికెట్‌ అభిమానాన్ని పందెంగా మార్చడానికి బుకీలు తమ ఏజెంట్లకు స్పెషల్‌ తాయిలాలు ఇచ్చి మరి క్రికెట్‌ అభిమానులను బెట్టింగ్‌లకు అలవాటుపడేలా ప్రోత్సహిస్తున్నారు. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో గృహంలో కోట్ల రూపాయల క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న వారిని గతంలో స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులకు పట్టుకోవడం సంచలనం రేకెత్తించింది. కానీ వెంటనే వారు తమ డబ్బు, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చిన్న కేసులతో బ‌య‌ట‌ప‌డ్డారు. పట్టణంలో ఈ సీజన్‌కు సంబంబధించి ప్రస్తుతం దేవనగర్‌, మూలసాగరం, ఆత్మకూరు బస్టాండ్‌లలో నిర్వాహకులు తమ బెట్టింగ్‌ దుకాణాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది .

పట్టణంలో బెట్టింగ్‌ పాల్పడితే పోలీసులకు దొరికితే ఇబ్బంది అయి తమ పరువు పోతుందని కొందరు పందెంరాయుళ్ళు హైదరాబాద్‌, పూణే, ముంబాయిల బెట్టింగ్‌ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకున్నారు. కొందరు బెట్టింగ్‌ రాయుళ్ళు5 నుండి 10 మంది ఒక గ్రూపుగా తయారయ్యి అందరు కలసి కొన్ని లక్షల రూపాయలు జమ చేసుకొని క్రికెట్‌బుకీల అకౌంట్‌లో జమ చేసి పెడుతారు. అనంతరం మ్యాచ్‌రోజున ఫోన్‌లోనే టాస్‌ నుండి మొదలు పెట్టి బంతి బంతికి బెట్టింగ్‌ కాస్తూ తమ వద్ద ఉన్న బుక్‌లో వ్రాసుకుంటారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం గెలిచిన, ఓడిన డబ్బులను క్రికెట్‌ బుకీనుండి అకౌంట్‌ ద్వారానే ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటారు. బుకీలు కాసిన బెట్టింగ్‌లపై 30 నుండి 40 శాతం వరకు తమ కమీషన్‌గా వసూలు చేస్తారు. గెలిచిన వారు 30 నుండి 40 శాతం ఇవ్వగా ఓడిన బెట్టింగ్‌ కేంద్రాల నుండి వారికి ఇచ్చిన టార్గెట్‌ల మేరకు కోటి రూపాయలకు 10 నుండి 20 శాతం బెట్టింగ్‌ నడిపే కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. కొందరు బెట్టింగ్‌లలో డబ్బు పోగోట్టుకున్నవారు బుకీలుగా మారి ఇతరులను ఈ ఊబీలోకి దించి వారు లక్షలు ఆర్జిస్తున్నారు. బెట్టింగ్‌లో వడ్డీ వ్యాపారస్థులు… ఐపిఎల్‌ మ్యాచ్‌ మొదలయ్యిందంటే క్రికెట్‌బుకీలతో పాటు వడ్డీ వ్యాపారస్థులు ఎక్కువగా ఆనందపడుతారు.

ఎందుకంటే… బెట్టింగ్‌ రాయుళ్ళు ఎంత వడ్డీ అయిన చెల్లించడానికి సిద్దపడుతారు కాబట్టి వీరికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. బెట్టింగ్‌ల కోసం కొందరు తమ ఇండ్లను, స్థలాలను, వాహనాలు, ఇంట్లో బంగారాన్ని కూడా కుదువపెట్టి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని పందేలు కాస్తారు. బెట్టింగ్‌లో వారు గెలిస్తే వడ్డీ వ్యాపారస్థులకు వడ్డీ డబ్బులు వస్తాయి. లేదంటే కుదువ పెట్టినవి వారి పరమవుతాయి. కాబట్టి ఎలా అయిన వడ్డీ వ్యాపారస్థలుకు ఈ రెండు నెలలు పూర్తి ఆదాయాన్ని కళ్ళ చూస్తారు. యాప్‌ టెక్నాలజీతో ఫోన్‌లో బెట్టింగ్‌… టెక్నాలజీ పెరగడంతో బెట్టింగ్‌ నిర్వాహకులు కూడా తమ పంధాను మార్చారు. కొన్ని బెట్టింగ్‌ యాప్‌లను రూపొందించి వాటి ని సోషల్‌ మీడియా ద్వారా, వ్యక్తిగత మెస్సేజ్‌ల ద్వారా వాటికి ప్రచారం కల్పిస్తారు. ఎక్కువగా యువతను టార్గెట్‌ చేసుకొని వారి ఫోన్‌లలో బెట్టింగ్‌ యాప్‌లైన వింజో, 1ఎక్స్‌బెట్‌ వంటి వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకొనేలా ప్రోత్సాహాలు ఇస్తారు. ఒక్కసారి ఈ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత మ్యాచ్‌ మొదలయిన నుండి పూర్తి అయ్యేంత వరకు బెట్టింగ్‌, డబ్బుల జమా , చెల్లింపులు అన్ని ఫోన్‌పే ద్వారానే జరుగుతాయి.

దీంతో పని చేస్తున్న చోట నుండి సెల్‌ఫోన్‌లోనే అన్ని గమనించుకుంటూ ఎక్కువగా యువత బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. తక్కువ కాలంలో ఎ క్కువగా డబ్బులు సంపాదించవచ్చునని భ్రమపడి ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పులపాలవుతున్నారు. అనంతరం ఏమి చేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడటం, ఊరు విడిచి పారిపోవటం చేస్తున్నారు. దీంతో వారి కుంటుంబం తీవ్ర మనోక్షోభకు గురి అవుతూ అవమానాల పాలవుతున్నారు. ఈ సీజన్‌లో ఎక్కువగా ముంబాయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ పై ఎక్కువగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైన పోలీసులు ఈ ఐపిఎల్‌ సీజన్‌ బెట్టింగ్‌పై దృష్ఠి సారిస్తే మే నెలలో జరిగే క్వార్టర్‌,సెమిస్‌,ఫైనల్‌ మ్యాచ్‌లకు కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగకుండా అరికట్టవచ్చు. కళాశాలలో, యువత పని చేసే చోట బెట్టింగ్‌ వలన ఏర్పడే సమస్యలను, ఆర్థిక స్థితిగతులను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన యువత దారి తప్పకుండా చూడవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement