Saturday, April 27, 2024

IPL 2024 ..Second Match – టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ …బ్యాటింగ్ చేయనున్న ఢిల్లీ క్యాపిటల్స్

చండీగ‌డ్ – ఐపిఎల్ 2024లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.. నేటి మ‌ధ్యాహ్నం 3.30కి పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఢీకొట్ట‌నుంది.. చండీగ‌డ్ లో జ‌రిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.

కొత్త స్టేడియంలో తొలి మ్యాచ్

పంజాబ్‌ కింగ్స్‌ తన పోరును కొత్త స్టేడియంలో ప్రారంభించనుంది. చండీగఢ్‌ శివారులోని ముల్లాపూర్‌ గ్రామంలో మహరాజా యదవీంద్ర సింగ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం పేరిట పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ఈ నూతన స్టేడియాన్ని నిర్మించింది.
దాదాపు 33 వేల సీటింగ్‌ కెపాసిటీ కలిగిన, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ స్టేడియంలో శనివారం రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో ధవన్‌ సారథ్యంలోని పంజాబ్‌ జట్టు తలపడనుంది. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఈ స్టేడియం ఇకనుంచి పంజాబ్‌ ఫ్రాంచైజీకి సొంత మైదానం..

అత‌డిపైనే అంద‌రి దృష్టి..

గత ఐపీఎల్ పేలవమైన ప్రదర్శనను మర్చిపోయి ఇరుజట్లు అంటే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడేందుకు సిద్ధమ‌య్యాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రిషబ్ పంత్‌పైనే ఉంటుంది. దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఐపీఎల్ ద్వారా పోటీ క్రికెట్‌లోకి తిరిగి రాబోతున్నాడు. డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను అనేక రౌండ్ల మోకాలికి శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. కానీ, అతని బలమైన సంకల్పం కారణంగా, పంత్ తిరిగి రంగంలోకి దిగాడు.

- Advertisement -

రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా ఆడేందుకు అనుమతి పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. గత సీజన్‌లో, పంత్ లేకపోవడంతో, డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో జట్టు 9వ స్థానంలో నిలిచింది. మ్యాచ్‌కు ముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ, “ఈసారి ఐపీఎల్‌కు ముందు చేసినంత బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు. అతను అదే ఫాంను తిరిగి పొందాలని చూస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

పంత్ వికెట్ కీపింగ్ దూరం..
పంజాబ్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. కాకపోతే, వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్ లేదా దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్ ఈ బాధ్యతను తీసుకోవచ్చు. ఢిల్లీకి మంచి బౌలింగ్‌ ఎటాక్‌ ఉంది. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు అతను మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు.

స్పిన్ కు కుల్దీప్ సార‌ధ్యం
ఢిల్లీలో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్ వంటి దూకుడు బ్యాట్స్‌మెన్ ఉండగా, బౌలింగ్‌లో ఎన్రిక్ నోర్కియా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ నాయకత్వం వహిస్తారు. స్పిన్‌ విభాగం బాధ్యతలు కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ భుజాలపై ఉంటాయి.

శిఖ‌ర్ ధ‌వ‌న్ నాయ‌క‌త్వంలో పంజాబ్ ప‌టిష్టం..

పంజాబ్ కింగ్స్ కూడా తమ గత ప్రదర్శనను మరచిపోవాలని కోరుకుంటారు. ఢిల్లీ క్యాపిటల్స్ లాగా, పంజాబ్ కింగ్స్ కూడా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయినప్పుడు ఒక్కసారి మాత్రమే ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత, 2019 నుంచి 2022 వరకు, జట్టు వరుసగా 4 IPL సీజన్లలో 6వ స్థానంలో కొనసాగింది. 2023లో 8వ స్థానానికి పడిపోయింది. శిఖర్ ధావన్ రూపంలో, భారత క్రికెట్ జట్టుకు దూరమైన తర్వాత తన సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతున్న కెప్టెన్ పంజాబ్‌కు ఉంది. ఆల్ రౌండర్లు సికందర్ రజా, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్‌ల ఫామ్ కీలకం కానుంది. ఫాస్ట్ బౌలింగ్‌లో కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ భుజాలపై పెద్ద బాధ్యత ఉంటుంది. అయితే, పంజాబ్ ఎప్పుడూ జట్టుగా ఐక్యంగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీదే పైచేయిగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement