Wednesday, May 1, 2024

విదేశీ ఎంబీబీఎస్‌లకు స్వదేశంలో ఇంటర్న్‌ షిప్‌.. అనుమతించిన ఎన్‌ఎంసీ తాజా నిబంధనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థులకు మన దేశంలో ఇంటర్న్‌ షిప్‌ చేసుకునేందుకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెసులుబాటు కల్పించింది. అయితే మొదటి ప్రాధాన్యత కింద వీరికి కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనే ఇంటర్న్‌ షిప్‌ను కేటాయించాలని సూచించింది. ఏ ప్రభుత్వ వైద్య కళాశాలలోనైనా 7.5శాతం ఇంటర్న్‌ షిప్‌ సీట్లను విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏటా 3వేల మంది దాకా ప్రభుత్వ, ప్రయివేటు మెడికోలు ఎంబీబీఎస్‌ విద్య పూర్తి చేసుకుంటున్నారు. వీరంతోపాటు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారు కూడా గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లోనే ఇంటర్న్‌ షిప్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్‌ఎంసీ తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్‌, రామగుండం తదితర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఇంటర్న్‌ షిప్‌ను విదేశీ విద్యార్థులకు కేటాయించే అవకాశం లభించింది.

ఎక్కడ ఎంబీబీఎస్‌ చదివితే అక్కడే ఇంటర్న్‌ షిప్‌ చేసే విధంగా కొత్తగా నిబంధనలను తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కి తెలంగాణ వైద్య, విద్యా డైరెక్టరేట్‌ లేఖ రాసింది. ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లో 500 మంది ఇంటర్న్‌ షిప్‌ చేస్తున్న వైద్య విద్యార్థులు ఉన్నారని, వీరుకాకుండా మరికొంతమందిని చేర్చుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఇంటర్న్‌ షిప్‌లో చేర్చుకోకుండా నిబంధనలను సవరించాలని కోరారు. ఎన్‌ఎంసీ నూతన నిబంధనలకు ముందు వరకు ఎంబీబీఎస్‌ విద్య పూర్తి కాగానే ఇంటర్న్‌ షిప్‌ చేయడం వైద్య విద్యార్థులకు అంత ఈజీ వ్యవహారం కాదు. ఇక ప్రయివేటు మెడికోలకు ఇంటర్న్‌ షిప్‌ అంశం మరీ కష్టం . ఈ నేపథ్యంలో వీరి కోసం ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇప్పటివర కు ప్రయివేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్న మెడికోలు … ఇంటర్న్‌ షిప్‌ మాత్రం ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలో చేస్తున్నారు. అత్యధిక ప్రయివేటు వైద్య కళాశాల్లోల ఇందే తంతు కొనసాగుతోంది. వైద్య విద్యార్థులు కూడా తమకు మెరుగైన, అనుభవపూర్వకమైన శిక్షణ లభిస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే ఇంటర్న్‌ షిప్‌కు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యవహా రానికి తాజా నిబంధనలతో జాతీయ వైద్య కమిషన్‌ అడ్డుకట్ట వేసింది. ఎక్కడ ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తారో అదే వైద్య కళాశాలకు చెందిన అనుబంధ ఆసుపత్రిలోనే ఇంటర్న్‌ షిప్‌ పూర్తి చేసేలా నిబంధనలు అమలుల్లో కి వచ్చాయి. నవంబరు 2021 తర్వాత ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. కొత్త నిబంధనల అమలుపైనా వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలను ఎన్‌ఎంసీ ఆదేశించింది.

కాగా… ఎంబీబీఎస్‌ విద్య పూర్తయిన తర్వాత రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రెండేళ్లలోపు 12నెలలోపు ఇంటర్న్‌ షిప్‌ను పూర్తి చేయాలి. విదేశాల్లో ఎంబీబీఎస్‌ను పూర్తి చేసిన వారు రెండేళ్లలోపు ఇంటర్న్‌ షిప్‌ను పూర్తి చేయాలి. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులు ముందస్తు అనుమతితో 15 రోజుల సెలవులు తీసుకోవచ్చు. ఇంటర్న్‌ షిప్‌ చేసే విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసేందుకు పీజీ వైద్య విద్య పూర్తి చేసిన అధ్యాపకుడిని కచ్చితంగా నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నెలనెలా జీతం చెల్లించాలి.

ప్రయివేటు వైద్య కాలేజీలు ఇప్పటి వరకు ఎంబీబీఎస్‌ విద్య బోధించినందుకు పెద్ద మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజులు దండుకుంటున్నాయని, ఇంటర్న్‌ షిప్‌ మాత్రం వేరేచోట చేసుకోండని చేతులెత్తుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎన్‌ఎంసీ తెచ్చిన ఎక్కడ ఎంబీబీఎస్‌ చదివితే అక్కడే ఇంటర్న్‌ షిప్‌ను పూర్తి చేయాలన్న నిబంధనతో ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్య, విద్యా బోధనా సదుపాయాలు మెరుగుపడనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవుజ్ఞులైన వైద్య బోధనా అధ్యాపకలను ఇకపై ప్రయివేటు కాలేజీలు నియమించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని, పేషెంట్ల కు కూడా అనుభవుజ్ఞులైన ప్రొఫెసర్ల వైద్యం అందుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement